ఏ కులంరా నీదని అడిగి మీరు మారరా అన్నడని.. కౌశిక్ రెడ్డిపై డ్రైవర్ ఫిర్యాదు

  • తిట్టి, కొట్టి మెడ పట్టి గెంటించిండు
  • ఎమ్మెల్సీ కౌశిక్​రెడ్డిపై సీపీకి ప్రొటోకాల్​ డ్రైవర్​ ఫిర్యాదు 
  • పర్సనల్ డ్రైవర్, పీఏపై కూడా కంప్లయింట్​ 
  • ప్రాణభయం ఉందన్న బాధితుడు 

కరీంనగర్ క్రైం, వెలుగు : ఎమ్మెల్సీ, మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి కులం పేరుతో తిట్టడమే కాకుండా, చెంపపై కొట్టాడంటూ ఆయన వద్ద ప్రొటోకాల్ డ్రైవర్ గా పనిచేసే కన్నం సాయికృష్ణ  కరీంనగర్ సీపీ సుబ్బారాయుడికి గురువారం ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం ప్రకారం..కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మనగర్ కాలనీకి చెందిన కన్నం సాయి కృష్ణ రెండు నెలలుగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి వద్ద ప్రొటోకాల్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

ఈనెల 13న కరీంనగర్ లో తీగలగుట్టపల్లిలో ఆర్వోబీకి భూమిపూజ, ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో ప్రెస్ మీట్ తర్వాత ఎమ్మెల్సీ గౌతమినగర్ లో ఉన్న నర్సింగాపూర్ సర్పంచ్ ఇంటికి వెళ్లారు. అక్కడ కౌశిక్ రెడ్డి పీఏ సాగర్ రెడ్డితో సాయికృష్ణ  మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి పర్సనల్ డ్రైవర్ సంపత్ వచ్చి అకారణంగా కొట్టి, కులం పేరుతో తిట్టాడు. అదే రాత్రి వీణవంకకు వెళ్లగా సంపత్ తో పాటు మరో ఇద్దరు వచ్చి మళ్లీ కొట్టడం మొదలుపెట్టారు. దీంతో బాధితుడు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి దగ్గరకు పరిగెత్తాడు. విషయాన్ని ఆయనకు చెప్పగా ‘నీది ఏం కులం రా’ అని అడిగాడు. 

ఎస్సీ మాదిగ అని చెప్పడంతో  ‘మీరు ఇగ మారరారా ?’ అని తిడుతూ చెంపపై కొట్టాడు. తర్వాత పీఏని పిలిపించి సాయికృష్ణను మెడ పట్టి బయటికి గెంటేయించాడు. దెబ్బలు బాగా తాకడంతో కుటుంబసభ్యులు అతడిని ఓ హాస్పిటల్ లో చూపించారు. తర్వాత మూడు రోజులకు సీపీని కలిసి ఫిర్యాదు చేసేందుకు రాగా ఆయన అందుబాటులో లేకపోవడంతో వెళ్లిపోయాడు. తిరిగి గురువారం వచ్చి కంప్లయింట్​ చేశాడు. తనకు ఎమ్మెల్సీ నుంచి ప్రాణభయం ఉందని, న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.