బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. పాడి కౌశిక్ రెడ్డితో పాటు..ఆయన డ్రైవర్ తనను కులం పేరుతో దూషించారని కన్నా సాయి కృష్ణ అనే వ్యక్తి కరీంనగర్ సీపీకి ఫిర్యాదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డితో పాటు ఆయన డ్రైవర్ వేణు సంతోష్ తనపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరి వల్ల తనకు ప్రాణహాని ఉందని... కులం పేరుతో దూషించిన కౌశిక్ రెడ్డి, ఆయన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలంటూ సీపీకి విజ్ఞప్తి చేశాడు సాయికృష్ణ.
జులై 13వ తేదీ గురువారం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పర్సనల్ డ్రైవర్ వేణు సంపత్ అనే వ్యక్తి తనపై దాడి చేసి కులం పేరుతో తిట్టాడని కన్నా సాయి కృష్ణ ఆరోపించారు. ఇదే విషయాన్ని పాడి కౌశిక్ రెడ్డికి చెబితే..ఆయన కూడా కులం పేరుతో హేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. “మీది ఏ కులం?” అంటూ పాడి కౌశిక్ రెడ్డి అడిగాడని.. “మీ కులపోళ్లు మారరా?” అంటూ తనను కౌశిక్ రెడ్డి తిట్టాడరని చెప్పాడు. అంతేకాకుండా తన చెంపపై కొట్టి అక్కడున్న సిబ్బందితో మెడపట్టి బయటకు గెంటివేయించాడని బాధపడ్డాడు. కౌశిక్ రెడ్డి డ్రైవర్ వేణు సంపత్ తనను చంపేందుకు ప్రయత్నించారని..ఆరోపించాడు. తాను ఇన్ని రోజులు చికిత్స పొందానని..అందుకే ఆలస్యంగా ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని బాధితుడు కన్నా సాయికృష్ణ పేర్కొన్నాడు.