ముదిరాజ్ కులస్తులపై ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ముదిరాజ్ కులస్తులు ధర్నాకు దిగారు. ముదిరాజ్ కులస్థులను, ముదిరాజ్ కులాన్ని కించపరుస్థూ పాడికౌశిక్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా పెద్దపల్లి జిల్లాలోని ముదిరాజ్ కులస్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మంథని అంబేద్కర్ చౌరస్తాలో పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టారు. ఆ తర్వాత దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ముదిరాజ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
అటు రంగారెడ్డి జిల్లా బస్టాండ్ జాతీయ రహదారిపై ముదిరాజ్ సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. ముదిరాజ్ కులస్తుడైన యూట్యూబ్ ఛానల్ జర్నలిస్ట్ ను అసభ్యకరమైన పదజాలంతో దూషించడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. శంషాబాద్ బస్టాండ్ నుండి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ వరకు శవయాత్ర తీశారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు.
హుజూరాబాద్ లో ఓ యూట్యూబ్ ఛానెల్ కెమెరామెన్ ను అసభ్య పదజాలంతో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తిడుతున్న ఆడియో వైరల్ అయింది. బాధితుడు అజయ్ తనకు కౌశిక్ రెడ్డితో ప్రాణహాని ఉందని సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేశారు. తాను హుజూరాబాద్‌లో అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లానని బాధితుడు అజయ్ ముదిరాజ్ తెలిపాడు. అ సమయంలో అక్కడ ఓ మహిళ.. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డిని సంక్షేమ పథకాలు రావడం లేదంటూ అడుగుతున్న విషయాన్ని కెమెరాలో రికార్డు చేశానన్నాడు. ఈ సమయంలో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తన అనుచరులు వచ్చి కారులో తీసుకెళ్ళి ఇష్టానుసారంగా దాడి చేశారని బాధితుడు అజయ్ ఆరోపించాడు. అంతటితో ఆగకుండా ముదిరాజ్ కులం పేరుతో పచ్చి బూతులతో తిట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం కులం పేరుతో ఆజయ్ ముదిరాజ్ ను దూషించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ కులసంఘాలు ఆందోళనకు దిగాయి.