- ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: గండిపేట చెరువు పైభాగాన కొత్వాల్ గూడలోని తన ఇల్లు అక్రమ కట్టడమని తేలితే దాన్ని తానే కూల్చేస్తానని..లేదా కేటీఆర్ కూల్చినా పర్వాలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బంజారాహిల్స్ లోని తన ఇంట్లో మీడియాతో మాట్లాడారు. " కొత్వాల్ గూడలోని నా ఇల్లు ఎఫ్టీఎల్ లో లేదు. నేను నిబంధనలు ఉల్లంఘించి దాన్ని కట్టినట్టు కేటీఆర్ నిరూపిస్తే..ఆయనే వచ్చి కూల్చుకోవచ్చు.
నా ఇల్లు, తోట ఎఫ్టీఎల్ లో, బఫర్ జోన్ లో గాని లేవు. కబ్జాలు చేయాల్సిన అవసరమే నాకు లేదు. ఇరిగేషన్ అధికారులు, కలెక్టర్ సూచన మేరకే నేను ఇల్లు కట్టాను. చెరువు పైన నేను ఎలాంటి కపౌండ్ వాల్ కట్టలేదు.111 జీవో పరిధిలో చాలా మంది పెద్దవాళ్లు ఫాం హౌస్ లు కట్టారు. అందరితో పాటే నేనూ ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా ఓ చిన్న ఇల్లు కట్టాను.111 జీవో పరిధిలో ఎవరైనా సరే తమకు ఉన్న వ్యవసాయ భూమిలో 10 శాతం నిర్మాణం చేసుకోవచ్చు.
1999 లో14 ఎకరాల14 గుంటల పట్టా భూమిని కొనుగోలు చేసి అందులో మామిడి తోట, వరి సాగు చేస్తున్నాను. అది కూడా నా కొడుకు రినీశ్ పేరు మీద ఉంది. ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బాధ్యత గల ప్రజా ప్రతినిధిగా హైడ్రాకు సంపూర్ణమైన మద్దతు ఇస్తాను. చెరువుల పరిరక్షణ కోసం సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిలో అండగా నిలుస్తా. చెరువులు కబ్జాలు చేసిన ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకునే అధికారం హైడ్రాకు ఉంది" అని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.