
కోడి పందాల కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ( మార్చి 14 ) పోలీసుల విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. నాలుగు గంటల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు పోచంపల్లి. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు మాత్రమేనని అన్నారు.పోలీసులు లీజుకు సంబంధించిన వివరాలను అడిగారని.. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని అన్నారు.
గతంలో తాను రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లోని అంశాలే పోలీసులకు చెప్పానని.. అదే వాస్తవం అని అన్నారు. మరోసారి విచారణకు హాజరయ్యే అంశంపై పోలీసులు ఏమీ చెప్పలేదని అన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసు అని.. ఈ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని అన్నారు పోచంపల్లి.
కాగా, 2025 ఫిబ్రవరి 11న రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోలుకట్ట గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, చేవెళ్ల ఏసీపీ ఐ.కిషన్, మొయినాబాద్ సీఐ పవన్ కుమారెడ్డి 50 మంది సిబ్బందితో కలిసి పందేల శిబిరంపై దాడి చేశారు. ఏపీకి చెందిన నిర్వాహకుడు శివకుమార్, పందెం రాయుళ్లను చుట్టుముట్టి మొత్తం 64 మందిని అదుపులోకి తీసుకున్నారు.
84 పందెం కోళ్లు, రూ.30 లక్షల క్యాష్, 50 కార్లను స్వాధీనం చేసుకున్నారు. 64 మందిని మొయినాబాద్ పీఎస్‌కు తరలించారు. అయితే.. కోడి పందెలు నిర్వహించిన ఫామ్ హౌస్‌ను ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి శివకుమార్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఆయనపై సెక్షన్- 3& 4 గేమింగ్ యాక్ట్, సెక్షన్ -11 యానిమల్ యాక్ట్ నమోదు కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణకు 2025, ఫిబ్రవరి 13న పోలీసులు నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో తన న్యాయవాది ద్వారా పోలీసుల నోటీసులకు రిప్లై పంపించారు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి. తాజాగా ఇదే కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరోసారి సమన్లు జారీ చేశారు. మార్చి 14న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఆయన మొయినాబాద్ పీఎస్ లో విచారణకు హాజరయ్యారు.