- ఖమ్మం జిల్లాలో 67.63 శాతం,కొత్తగూడెం జిల్లాలో 70.01 శాతం పోలింగ్ నమోదు
ఖమ్మం/ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరిగింది. ఒకటిరెండు చోట్ల తప్ప ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. సాయంత్రం 4 గంటల వరకు ఖమ్మం జిల్లాలో 67.63 శాతం పోలింగ్ నమోదు కాగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 70.01శాతం ఓటింగ్ నమోదైంది.
ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పొద్దటి నుంచే గ్రాడ్యుయేట్లు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. మహిళలు, ఉద్యోగులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పలువురు దివ్యాంగులు ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ దంపతులు ఖమ్మం మహిళా ప్రభుత్వ కాలేజీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలైన్లలో ఉన్న వారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ లను ప్రత్యేక వాహనాల్లో, పోలింగ్ భద్రత, బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మందకొండిగా మొదలైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఊపందుకుంది. జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు 40,106 మంది ఉండగా 28,077 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 10 గంటలవరకు కేవలం 7.7శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. 12 గంటల వరకు 25.79శాతం,2 గంటలవరకు 46.60శాతం పోలింగ్ నమోదు కాగా.. ముగిసే సమయానికి 70.01శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు తెలిపారు.
ఓటేసిన ప్రముఖులు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, అధికారులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ ఖమ్మం లోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజీలో, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం ఇందిరానగర్ స్కూల్ లో, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ దంపతులు సత్తుపల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఓటింగ్ సరళిని
పరిశీలించారు.
బీజేపీ నేత కారును అడ్డుకున్న కాంగ్రెస్
ఖమ్మం జిల్లా ముదిగొండలో డబ్బులు తరలిస్తున్నారంటూ బీజేపీ నేత దేవకి వాసుదేవరావు వాహనాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యం చేసుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
- ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, వైరా, మధిర, పాలేరులో పలు చోట్ల ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. పోల్ స్లిప్ లు చూపించిన వారికి, రూ.500 చొప్పున పంపిణీ చేశారు.
- పలు చోట్ల పార్టీ ముఖ్య నేతల నుంచి వచ్చిన డబ్బులను తమకు పంపిణీ చేయకుండా లీడర్లే జేబులో వేసుకున్నారంటూ ఓటర్లు ఆరోపించారు.
- ఖమ్మం జిల్లా వైరాలోని 394 పోలింగ్ బూత్ లో తన ఓటును వేరెవరో వేశారంటూ సంపశాల మోహన్ కాంత్ అనే గ్రాడ్యుయేట్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.
- కూసుమంచిలో కన్నెబోయిన నరేశ్ అనే ఓటరు తన ఓటు హక్కు వినియోగించు కోలేకపోయాడు. సాయంత్రం 4 గంటలకే క్యూలైన్లో నిల్చున్నా, చివరకు ఓటు వేసే సమయానికి అదే పోలింగ్ కేంద్రంలోని మరో బూత్ లో ఓటు ఉండడంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటేసేందుకు అనుమతించలేదు.