ఇవాళ(ఫిబ్రవరి 27) తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు..

ఇవాళ(ఫిబ్రవరి 27) తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు..
  • రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి పోలింగ్ 
  • ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. 
  • బ్యాలెట్ బాక్సులతో పోలింగ్ స్టేషన్లకు బయలుదేరిన సిబ్బంది   
  • ఓటర్లుగా నమోదైన ఉద్యోగులు, టీచర్లకు స్పెషల్ క్యాజువల్ లీవ్

కరీంనగర్/నల్గొండ, వెలుగు:  ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటరు స్లిప్పుతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాల్సి ఉంటుంది. 

ఆ రెండు స్థానాలకు 680 పోలింగ్ స్టేషన్లు.. 

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల్లో  మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లతో పాటు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో 15  జిల్లాలకు ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులను బుధవారం డిస్ట్రిబ్యూట్ చేశారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అంబేద్కర్ స్టేడియంలోని రిసెప్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించనున్నారు. 

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతతో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, సీసీ కెమెరాల నిఘాతో పాటు కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తిస్తుందని తెలిపారు. 

వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీల్లో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా యాజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు. 

‘కరీంనగర్ గ్రాడ్యుయేట్’ బరిలో 56 మంది.. 

మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో 56 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యే పోటీ నెలకొంది. ఇక మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ -టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ 
రఘోత్తం రెడ్డి మధ్య పోటీ ఉంది.  

నల్గొండ టీచర్ స్థానానికి 200 పోలింగ్ స్టేషన్లు.. 

వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 191 మండలాల్లో 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 25,797 మంది టీచర్లు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. నల్గొండ ఆర్జాలబావి పాలిటెక్నిక్ కళాశాలలో సిబ్బందికి బుధవారం ఎన్నికల సామగ్రి పంపిణీ చేశారు. 

ఈ పంపిణీ కేంద్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. కాగా, ఈ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 19 మంది బరిలో నిలిచారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (యూటీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), గాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి హర్షవర్ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి (టీపీఆర్టీయూ), పింగళి శ్రీపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి ( పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీయూ-టీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పులి సరోత్తం రెడ్డి (బీజేపీ) ఉన్నారు.