
- ఇయ్యాల ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు
- గతంలో టీచర్లు, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో చెల్లని వేల ఓట్లు
- అవగాహన లేక పొరపాట్లు చేస్తున్నారంటున్న ఆఫీసర్లు
- టిక్ లు పెట్టడం, పేర్లు రాయడం చేయొద్దంటూ సూచన
కరీంనగర్, వెలుగు:గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసే ఓటర్లు విద్యావంతులే అయినా.. ఓటేయడంపై అవగాహన లేకపోవడంతో వేల ఓట్లు చెల్ల కుండా పోతున్నాయి. సాధారణ ఎన్నికల ఓటింగ్ తో పోలిస్తే ఎమ్మెల్సీ ఓటింగ్ భిన్నంగా ఉండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అందుకే గ్రాడ్యుయేట్లు, టీచర్లు ఓటు వేసే విధానంపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
గురువారం ఉమ్మడి మెదక్, నిజామా బాద్-, ఆదిలాబాద్,- కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతోపాటు ఉమ్మడి వరంగల్, -ఖమ్మం-, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి చాలా మంది గ్రాడ్యుయేట్లు, టీచర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరేండ్ల కింద ఓటేసిన ఓటర్లలో కొందరికి ఇప్పుడు ఓటేసే విధానం గుర్తుండకపోవచ్చు. అందుకే ఓటు ఎలా వేయాలో తెలుసుకున్నాకే పోలింగ్ బూత్ లోకి వెళ్లాలి.
గత ఎన్నికల్లో భారీగా చెల్లని ఓట్లు
వరంగల్,- ఖమ్మం,- నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి గతేడాది మార్చిలో జరిగిన ఎన్నికల్లో 27,990 ఓట్లు చెల్లకుండాపోయాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ కు వచ్చిన ఓట్లతో ఇవి సమానం కావడం గమనార్హం. అలాగే అంతకుముందు 2021 మార్చిలో ఇదే స్థానానికి జరిగిన ఎన్నికల్లో 21,639 ఓట్లు, 2015లో జరిగిన ఎన్నికల్లో 14,033 ఓట్లు చెల్లకుండాపోయాయి.
2021లో హైదరాబాద్,- మహబూబ్ నగర్-, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 21,309 ఓట్లు చెల్లలేదు. 2019లో మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో 9,932 మంది టీచర్ల ఓట్లు చెల్లకుండాపోయాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే అంతటి సంఖ్యలో ఓట్లు చెల్లకపోవడం అభ్యర్థులను కూడా ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది.
ఓటు వేయండిలా..
తొలి ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటే అభ్యర్థి పేరు ఎదురుగా బాక్స్ లో 1 అంకె వేయాలి. అది వేయకుండా 2, 3 సంఖ్యలను వేస్తే చెల్లుబాటు కాదు. కచ్చితంగా 1 అంకె ఎవరికైనా ఇచ్చిన తర్వాతే వేరొకరికి 2,3,4,5 నంబర్లు ఇవ్వాలి. ఎక్కువ మందికి ప్రయార్టీ ఇవ్వడం ఇష్టం లేకపోతే ఒకటో ప్రాధాన్యం ఇచ్చి కూడా వదిలేయొచ్చు.
మిగతా అభ్యర్థులకు ప్రాధాన్యమివ్వడమనేది ఓటరు ఇష్టం.
ఒక అభ్యర్థికి ఒక ప్రాధాన్య అంకెను మాత్రమే ఇవ్వాలి. ఒకే అంకెను ఇద్దరి, ముగ్గురికి ఇవ్వొద్దు.
ఇద్దరు అభ్యర్థుల పేర్ల మధ్యలో అంకె వేసినా చెల్లదు.
క్యాండిడేట్ల పేర్ల ఎదుట ఇంగ్లిష్లో వన్ , ఓకే , టిక్ లు పెట్టడం, ఇతర సింబల్స్ పెట్టడం, పదాలు రాయడం అసలే చేయొద్దు.
బ్యాలెట్ లో పేరు రాయడం, సంతకం చేయడం, ఇతర అక్షరాలు ఏవి రాసినా చెల్లవు. కేవలం అంకెలు మాత్రమే వేయాలి.
బ్యాలెట్ పత్రంలో పోలింగ్ సిబ్బంది ఇచ్చే ఊదా(వాయి లెట్) రంగు స్కెచ్ పెన్నుతో మాత్రమే ఓటు వేయాలి. సొంతంగా తీసుకెళ్లిన వేరే పెన్ను, పెన్సిల్ తో నంబర్ వేయొద్దు. అలాగే టిక్ పెట్టడం, ఓకే అనే అక్షరాలు కూడా రాయొద్దు.
టీచర్లకూ ఓటేయ రావట్లే..
2019లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో 533 మంది ఓట్లు చెల్లలేదు. అదే ఏడాది జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్స్ఎమ్మెల్సీ ఎన్నికల్లో 668 ఓట్లు మురిగిపోయాయి.