బీసీ కులగణనను స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం

బీసీ కులగణనను స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం

బషీర్ బాగ్, వెలుగు: బీసీ కులగణనను స్వాగతిస్తున్నామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం చెప్పారు. అలాగే రాష్ట్రంలోని అన్ని వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయా కులాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. కులాల లెక్కలు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సంపత్ కుమార్ బుధవారం టీజేఎస్​లో చేరారు.  

నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో కోదండరాం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విమర్శిస్తున్నారన్నారు. మూసీ బ్యూటిఫికేషన్​ను తాము స్వాగతిస్తున్నామని చెప్పారు. 

నిర్వాసితులకు పునరావాసం కల్పించాకే పనులు ప్రారంభించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు సంపత్​సేవలను ఉపయోగించుకుంటామని కోదండరాం చెప్పారు.