వీఆర్ఏలకు న్యాయం చేస్తం: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం. కోదండరాం హామీ

ముషీరాబాద్, వెలుగు: జీఓ నంబర్81 ప్రకారం వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరాం హామీ ఇచ్చారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను సక్సెస్​చేసేందుకు వీఆర్ఏలు సహకరించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వీఆర్ఏ జేఏసీ అధ్యక్షుడు వంగూరు రాములు అధ్యక్షతన సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ హరగోపాల్ హాజరయ్యారు.

కోదండరాం మాట్లాడుతూ వీఆర్ఏలు న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ వీఆర్ఏలకు పే స్కేల్, వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి నెరవేర్చలేదని విమర్శించారు.

హరగోపాల్ మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యను తాము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. వీఆర్ఏ జేఏసీ నాయకులు శ్రీకాంత్, శేఖర్, మధు, సాగర్, శివ, రజనీకాంత్, ఆంజనేయులు  పాల్గొన్నారు.