సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ​కోదండరాం

సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి  రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది: ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ​కోదండరాం
  • సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి
  •  రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది
  • కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్

ముషీరాబాద్, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోఆర్డినేషన్​లేక సమగ్ర శిక్ష ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్​కోదండరాం అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని, సీఎం రేవంత్​రెడ్డితో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ శనివారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్​లో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కోదండరాం, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య, కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు.

ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులందరిని విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని,  అప్పటివరకు పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు దుండిగల్ యాదగిరి, ఝాన్సీ సౌజన్య మాట్లాడుతూ.. ఎన్నికల టైంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ప్రతి ఉద్యోగికి జీవిత బీమా రూ.10 లక్షలు, ఆరోగ్య బీమా రూ.10 లక్షలు సౌకర్యం కల్పించాలని కోరారు. విద్యాశాఖ నియామకాల్లో వెయిటేజ్ కల్పించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో చావ రవి, వెంకట్, పింగళి శ్రీపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, హనుమంతరావు, సత్యనారాయణ, అనిల్ చారి, మల్లేశ్, సురేందర్, ఫాతిమా, జానకిరామ్ తదితరులు పాల్గొన్నారు.