
ముషీరాబాద్, వెలుగు: మహిళల్లో ఆత్మస్థైర్యం పెరిగిందని, సమాజంలో తామూ సగ భాగమంటూ ముందుకు వస్తున్నారని ఎమ్మెల్సీ ప్రొఫెసర్కోదండరాం చెప్పారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన ఆడవారు గడప దాటి ఉద్యోగాలు చేయడం మంచి పరిణామమన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం దోమలగూడలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
కోదండరాం మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వంతో మహిళలపై వేధింపులు తగ్గాయన్నారు. టీఎన్జీఓ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, మహిళా విభాగం నాయకురాలు దీపారెడ్డి, సుజాత, శిరీష, రామ్ రెడ్డి, సత్యనారాయణ, శ్యామ్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆఫీసుల్లో మహిళా దినోత్సవం
రంగారెడ్డి కలెక్టరేట్/పంజాగుట్ట/ముషీరాబాద్: కొంగరకలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, మహిళా ఉద్యోగులు, ఆఫీసర్లు పాల్గొన్నారు. ఇర్రంమంజిల్ బీసీ ఉద్యోగుల సంఘం ఆఫీసులో నిర్వహించిన వేడుకల్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమ, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.చంద్రశేఖర్ గౌడ్ పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో సెంట్రల్ సిటీ కమిటీ ఆఫీస్నుంచి ఆర్టీసీ ఎక్స్ రోడ్ వరకు మహిళలు, బాలికలకు రక్షణ కల్పించాలని కోరుతూ ర్యాలీ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పాల్గొన్నారు. వాటర్‌బోర్డు హెడ్డాఫీసులో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఎస్సార్‌నగర్ ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సీఐ సైదులు సత్కరించారు.