జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలపై చర్చిస్తం : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

జీహెచ్ఎంసీ కార్మికుల సమస్యలపై చర్చిస్తం : ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం

దిల్ సుఖ్ నగర్, వెలుగు :  జీహెచ్ఎంసీ కార్మికుల సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా గుర్తిస్తుందని, కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐఎన్టీయూసీ, టీజేఏసీ, జీహెచ్ఎంసీ కార్మిక యూనియన్ నాయకులతో కలిసి ప్రభుత్వంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్, కోదండరాం అన్నారు.  మంగళవారం ఎల్బీనగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో ఐఎన్టీయూసీ అనుబంధ సంస్థ మున్సిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  కార్మికుల సమావేశానికి టీజేఏసీ (తెలంగాణ జన సమితి)  మద్దతు తెలిపింది.

 ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జి సంజీవరెడ్డి, నాయకులు జనక్ ప్రసాద్, సత్యజిత్ రెడ్డి, ఐఎన్టీయూసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఆదిల్ షరీఫ్ తదితరులతో కలిసి కోదండరాం హాజరయ్యారు.   బీ ఆర్ ఎస్ పాలనలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పాలకులను కలిసే పరిస్థితి లేదన్నారు. కానీ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కార్మిక పక్షపాతిగానే వ్యవహరిస్తుందన్నారు.   

తార్నాక :   తార్నాక డివిజన్​లోని  నాగార్జున నగర్ కాలనీ, స్నేహపురి కాలనీలలోని పార్కులను ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి    సందర్శించారు.  స్థానికులను,  వాకర్సును కలిసి పార్కుల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు.  సీనియర్ సిటిజనుల కోసం టాయిలెట్లు, వాకర్స్ కోసం సరైన సదుపాయాలు, అలాగే పర్యావరణ హితంగా ఉండే ఇతర వసతులను పార్కులలో ఏర్పాటు చేస్తామన్నారు.  ఈ మేరకు  జీహెచ్ఎంసీ  సికింద్రాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవి కిరణ్ కు   ఆదేశాలు జారీ చేశారు.