ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

చిట్యాల,మొగుళ్లపల్లి, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల, మొగుళ్లపల్లి మండలకేంద్రాల్లో గురువారం నిర్వహించిన మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి బర్త్ డే వేడుకల్లో వర్గపోరు కనిపించింది.  సిరికొండ వర్గీయులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహించగా.. దీనికి ఎమ్మెల్యే గండ్ర వర్గీయులు దూరంగా ఉన్నారు. వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సిరికొండకు మద్దతు పెరుగుతుందనే చర్చ మొదలైంది.

మొగుళ్లపల్లిలో ఘనంగా వేడుకలు.. 
మొగుళ్లపల్లిలో సిరికొండ బర్త్ డే వేడుకలు అట్టహాసంగా చేశారు. డీజేలు, మహిళలు కోలాటాలు, డోలు వాయిద్యాలతో హోరెత్తించారు. పటాకులు కాల్చి కేక్ కట్ చేశారు. సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, కోడారి రమేశ్, ఎర్రబెల్లి పున్నం చందర్ రావు, ధర్మారావు, రాములు, రాజేందర్ రెడ్డి, చంద్రమౌళి, అరవింద్, శ్రీనివాస్, యుగేందర్, ఎంపీటీసీలు సుధాకర్, రాజేశ్వరి సంపత్ తదితరులున్నారు.

పారదర్శకంగా పోడు సర్వే
మహబూబాబాద్ అర్బన్, వెలుగు: పోడు భూముల సర్వేను పారదర్శంగా నిర్వహించాలని, ప్రతి దరఖాస్తును క్షుణంగా పరిశీలించాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం బయ్యారం మండలం మోట్ల తిమ్మాపురంలో జరుగుతున్న సర్వేను అడిషనల్​కలెక్టర్ అభిలాష అభినవ్ తో పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అటవీ చట్టం నియమ, నిబంధనలకు లోబడి క్లైమ్ ల పరిశీలన జరగాలన్నారు. తప్పులు లేకుండా సర్వేలు చేయాలన్నారు. అనంతరం బయ్యారం మండలం సంతులపోడు తండా, కాచనపల్లి, కొత్తగూడెం గ్రామాల్లో పర్యటించారు. ప్రైమరీ స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. మన ఊరు–మన బడి పనులపై ఆరా తీశారు.

వెంకటేశ్ కు డాక్టరేట్
ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి వెంకటేశ్ కు రసాయన శాస్త్రంలో డాక్టరేట్ లభించింది. ఓయూలో పీహెచ్ డీ చేస్తున్న ఆయన.. ప్రొఫెసర్ పార్థసారథి ఆధ్వర్యంలో రసాయన శాస్త్రంలో పరిశోధన చేశారు.11 పరిశోధనా పత్రాలు, 4 పుస్తకాలు వివిధ అంతర్జాతీయ జర్నల్స్ లోనూ ప్రచురితం అయ్యాయి. ఆయన పరిశోధనకు గాను ఓయూ డాక్టరేట్ ప్రకటించింది.


ఓటమి భయంతోనే బీఆర్ఎస్

వెంకటాపురం, వెంకటాపూర్(రామప్ప),ములుగు, వెలుగు: సీఎం కేసీఆర్ ఓటమి భయంతోనే బీఆర్ఎస్ పార్టీ పెట్టిండని ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి విమర్శించారు. గురువారం ములుగు జిల్లాలోని వెంకటాపురం, వెంకటాపూర్, ములుగు మండలాల్లో ఆయన పర్యటించారు. మండల నాయకులతో మీటింగ్ నిర్వహించారు. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓడిపోతుందనే భయంతోనే బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశాడని ఎద్దేవా చేశారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ భద్రాచలం అసెంబ్లీ కన్వీనర్ గొల్లకోటి త్రినాథరావు, ములుగు అసెంబ్లీ కన్వీనర్ సిరికొండ బలరాం, వెంకటాపూర్, వెంకటాపురం మండలాల అధ్యక్షులు భూక్య జవహర్ లాల్, రఘురాం, పార్లమెంటరీ కో–కన్వీనర్ తక్కెళ్ళపల్లి దేవేందర్ రావు ఉన్నారు.

డ్యూటీలో చేరిన వీఆర్ఏలు
మహాముత్తారం,  వెలుగు: వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విధుల్లో చేరారు. గత 80 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేసిన వీఆర్ఏలు.. చర్చలు ఫలించడంతో బుధవారం డ్యూటీలో జాయిన్ అయ్యారు. తహసీల్దార్లను కలిసి స్వీట్లు పంపిణీ చేశారు. మహాముత్తారంలో వీఆర్ఏల సంఘం మండలాధ్యక్షుడు లింగమల్ల కరుణాకర్, వేల్పుల దుర్గయ్య, ఆత్కూరి మల్లయ్య, పుట్టల పోచయ్య, బోడ మల్లేశ్, మానేటి వెంకటి, చిన్న సమ్మయ్య తహసీల్దార్ మాధవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

బెల్ట్ షాపులు మూసేయాలి
గ్రామస్తుల ఏకగ్రీవ తీర్మానాలు

వర్ధన్నపేట, వెలుగు: బెల్ట్ షాపులతో విసిగివేసారిన ప్రజలు.. వాటిని మూసేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు. సర్కారు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తుండడం, బెల్ట్ షాపులను ఆఫీసర్లు నియంత్రించకపోవడంతో ఎక్కడికక్కడ షాపులు వెలిశాయి. అర్ధరాత్రి 12గంటల వరకు మద్యం అమ్ముతున్నా పట్టించుకునే నాథుడే లేడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల వ్యాప్తంగా యథేచ్ఛగా బెల్ట్ షాపులు నడుస్తుండడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మండలంలోని ఇల్లందలో దసరా రోజున యువకులు తాగి గొడవ పడడంతో ఓ వ్యక్తి కన్ను పోయింది. దీంతో ఆ గ్రామస్తులంతా బెల్ట్ షాప్​లను మూసివేయాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మిగిలిన  గ్రామాలు సైతం తీర్మానాల బాటపట్టేందుకు సిద్ధమయ్యాయి.


ఫారెస్ట్ ఆఫీసర్లు, పోడు రైతులు.. ఢీ అంటే ఢీ
గూడూరులో పోడు భూముల సర్వే ఉద్రిక్తం

గూడూరు, వెలుగు: పోడు భూములు సర్వే చేయొద్దని అటు ఫారెస్ట్ ఆఫీసర్లు, సర్వే చేయాలని ఇటు రైతులు ఢీ అంటే ఢీ అంటూ ధర్నాలు చేశారు. పాయిజన్ డబ్బాలు పట్టుకుని రైతులు నిరసన తెలపగా.. వీరికి దీటుగా దాదాపు 200మంది ఫారెస్ట్ ఆఫీసర్లు ఆందోళన చేపట్టారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లెపెల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... బొల్లెపెల్లి సమీపంలో మూడెకరాల పోడు భూములను మూడేండ్ల కింద ఫారెస్ట్ ఆఫీసర్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో ప్లాంటేషన్ చేపట్టారు. ప్రస్తుతం మొక్కలు ఏపుగా పెరిగి పెద్దవయ్యాయి. ఈ భూములు తమవే అంటూ అప్పట్లో రైతులు ఆందోళన చేశారు. పోడు దరఖాస్తుల్లోనూ వీటిని మెన్షన్ చేశారు. రెండ్రోజుల కింద ఆ చెట్లను రాత్రికిరాత్రే కొంతమంది నరికేశారు. ఈ క్రమంలో సదరు భూమిని సర్వే చేయడానికి గురువారం ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యులు వచ్చారు. దీంతో రైతులు, ఫారెస్ట్ ఆఫీసర్ల మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ యాసిన్, ఎస్సై సతీశ్​అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఆర్డీవో కొమురయ్య సమస్యను జిల్లా కలెక్టర్ శశాంకకు తెలియజేశారు. ఇరు వర్గాలకు నచ్చజెప్పి, శుక్రవారం నుంచి సర్వే చేస్తామని ఆర్డీవో హామీ ఇచ్చారు. 

అయిదుగురి రైతులపై కేసులు..
ప్లాంటేషన్ లో చెట్లు నరికేశారని ఫారెస్ట్ ఆఫీసర్లు గూడూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా..  ఎస్సై దిలీప్ అయిదుగురిపై కేసు నమోదు చేసి, రిమాండ్  కు తరలించారు. విచారణ చేపట్టి, త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తామన్నారు.

టార్గెట్ మేర పనులు చేయాలి
భూపాలపల్లి రూరల్, వెలుగు: భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీపీ–2 గనిని గురువారం సింగరేణి డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ పరిశీలించారు. కోల్ ప్రొడక్షన్, మట్టి వెలికితీత పనులు తనిఖీ చేశారు. మట్టి వెలికితీత 88శాతం మాత్రమే జరుగుతోందని, 100 శాతం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఇల్లందు గెస్ట్ హౌజ్ లో సింగరేణి కంపెనీ స్థాయి కల్చరల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు. టాప్ లో నిలిచిన వారిని కోల్ ఇండియా స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఏరియా జీఎం బళ్లారి శ్రీనివాసరావు తదితరులున్నారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
జనగామ అర్బన్, వెలుగు: జనగామ పట్టణం సాయినగర్ కు చెందిన ఆకుతోట యాదగిరి.. ఇటీవల కాలుకు గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యాదగిరిది పేద కుటుంబం కావడంతో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్ కుమార్ ఉన్నతాధికారుల, పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.1.5లక్షల చెక్కు మంజూరు కాగా.. గురువారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో ఆకుతోట మురళి, ఉదయ్ కుమార్, సాయిబాబా ఉన్నారు.

జిల్లాకు నిధులు మంజూరు చేయాలి
భూపాలపల్లి అర్బన్, వెలుగు: జిల్లాలో లైబ్రరీల అభివృద్ధికి నిధులు కేటాయించాలని డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ బుర్ర రమేశ్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్​లో మంత్రిని కలిసి బొకే అందజేశారు. భూపాలపల్లి జిల్లాకేంద్రంలో కొత్త లైబ్రరీ భవన నిర్మాణం కోసం రూ.4 కోట్లు కేటాయించాలన్నారు. అన్ని లైబ్రరీలకు ఫర్నిచర్, బుక్స్ కోసం మరో రూ.50లక్షలు సాంక్షన్ చేయాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు మీడియాకు చెప్పారు. రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ శ్రీధర్ ఉన్నారు.

బల్దియా అవినీతిపై విచారణ చేపట్టాలి
హనుమకొండ సిటీ, వెలుగు: బల్దియా అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని సీపీఎం లీడర్లు డిమాండ్ చేశారు. గ్రేటర్ పరిధిలో జరిగిన అవినీతిపై మంగళవారం ‘వెలుగు’లో కథనం రాగా.. సీపీఎం లీడర్లు స్పందించి, ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మంద సంపత్ మాట్లాడుతూ.. బల్దియాలో అవినీతి పేరుకుపోయిందన్నారు. ఇంజనీరింగ్, పబ్లిక్​ హెల్త్, అర్బన్ మలేరియా, టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్ ఇలా ఏది చూసినా, పైసలు వసూళ్లే కనిపిస్తున్నాయని మండిపడ్డారు. కార్మికుల పీఎఫ్ సొమ్ము దాదాపు రూ.2కోట్లు సైతం అవినీతిపాలైందని ఆరోపించారు.

‘తొలిమెట్టు’ను సక్సెస్ చేయాలి
హనుమకొండ సిటీ, జనగామ అర్బన్, వెలుగు: ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్లకు సబ్జెక్టులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రూపొందించిన ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని హనుమకొండ కలెక్టర్  రాజీవ్ గాంధీ హనుమంతు కోరారు. గురువారం కలెక్టరేట్ లో సమగ్ర శిక్ష అభియాన్ కో–ఆర్డినేటర్లు, ఎంఈవోలతో ఈ ప్రోగ్రాంపై రివ్యూ నిర్వహించారు. రేపటి నుంచి 31వ తేదీ వరకు అన్ని ప్రైమరీ స్కూళ్లలో ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. విద్యా సంవత్సరం ముగిసే సరికి ప్రతీ విద్యార్థి తెలుగు, ఆంగ్లం, గణితంలో ప్రావీణ్యం సంపాదించాలన్నారు. జనగామలోనూ కలెక్టర్ శివలింగయ్య దీనిపై రివ్యూ చేపట్టారు. ‘తొలిమెట్టు’ను పకడ్బందీగా అమలు చేయాలన్నారు.