బీజేపీ డబ్బు ఖర్చు చేసి గెలవాలని చూస్తోంది : ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్

మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ కేవలం డబ్బు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తోందని ఎమ్మెల్సీ టి. భాను ప్రసాద్ ఆరోపించారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులన్న ఆయన... బీజేపీకి బుద్ది చెబుతారన్నారు. బీజేపీ జోకుడు గాళ్ళు, పేకుడు గాళ్ళని.. తుపాకీ రాముళ్ల మాటలకు ప్రజలు లొంగరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించకూడదని తాము ఎన్నో సార్లు ఎన్నికల కమిషన్ కు మొరపెట్టుకున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయినా తమ మాటను ఈసీని పెడ చెవిన పెట్టడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తొలగించిన రోడ్ రోలర్ గుర్తును తొలగించారని, ఇపుడు మళ్లీ ఎవరి ఒత్తిడితో ఆ గుర్తుని కేటాయించారని ప్రశ్నించారు. 

ఈసీ ఇప్పటికైనా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని భాను ప్రసాద్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి.. మునుగోడు లో హామీలివ్వాలని చెప్పారు. సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి కేంద్రం నుంచి చిల్లిగవ్వ కూడా తేలేదన్న ఆయన... మునుగోడులో ఏదో వెలగబెడతారట అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. కేంద్ర మంత్రులు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మునుగోడులో గెలవడానికి బీజేపీ డబ్బునే నమ్ముకుందని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కారును పోలిన గుర్తుల విషయంలో ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని చెప్పారు.