మెట్ పల్లి, వెలుగు: దేశంలోని రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని, కాంగ్రెస్ సర్కారు అంటేనే కిసాన్ సర్కార్ అని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బూత్ లెవెల్ కార్యకర్తలతో, మెట్‌పల్లిలో మహిళా, యువజన సంఘాలు, కుల సంఘాలతో నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
జీవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేశామన్నారు. చెరుకు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ 17న నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామన్నారు. ఎంపీ అర్వింద్ పసుపు బోర్డు ఎక్కడ పెట్టాడో చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను నిజామాబాద్ ఎంపీగా గెలిపించాలని కోరారు. యామపూర్కు చెందిన కాంగ్రెస్ లీడర్ క్యాతం తిరుపతిరెడ్డి ఎన్నికల ఖర్చు కోసం జీవన్‌రెడ్డికి రూ.10వేలు అందజేశారు. బీఆర్ఎస్ లీడర్ ద్యాపతి సుదర్శన్, కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్, లీడర్లు జువ్వాడి కృష్ణారావు, కొమిరెడ్డి కరం, సుజిత్ రావు, మోహన్ రెడ్డి, జేఎన్ వెంకట్, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.