డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నోళ్లను నమ్మొద్దు : తాతా మధు

  • సండ్ర భారీ మెజార్టీతో గెలుస్తాడు
  • ఎమ్మెల్సీ తాతా మధు పిలుపుఎమ్మెల్యే సండ్రతో కలిసి కల్లూరు సభ ఏర్పాట్ల పరిశీలన 

కల్లూరు/ఇల్లెందు/భద్రాచలం, వెలుగు: జిల్లాలో కొంత మంది డబ్బు సంచులతో రాజకీయం చేస్తున్నారని, వారిని నమ్మొద్దని ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. బుధవారం మధ్యాహ్నం కల్లూరులో జరగనున్న సీఎం కేసీఆర్​ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పెద్ద పెద్ద మాటలు చెబుతున్న కాంగ్రెస్​పార్టీ నేటికీ సత్తుపల్లి అభ్యర్థి ఎవరో తేల్చ లేకపోతుందని తాతా మధు విమర్శించారు.

సండ్ర వెంకట వీరయ్య మరోసారి భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. వెంకటవీరయ్య పనితీరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ.. సీఎం సభకు నియోజవర్గంలోని ప్రజలు, పార్టీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. జనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో మొదటి విడత ప్రచారం పూర్తిచేశానని, 9న నామినేషన్ వేస్తున్నానని చెప్పారు.

కేసీఆర్ రూపొందించిన బీఆర్ఎస్​ మేనిఫెస్టోకి నిబద్ధత ఉందని, కాంగ్రెస్ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనం భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం సభకు 70 నుంచి 80 వేల మంది తరలి రానున్నారని తెలిపారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు పాలెపు రామారావు, జడ్పీటీసీ కట్ట అజయ్ బాబు, కల్లూరు ఎంపీపీ బీరవల్లి రఘు, తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు డాక్టర్ లక్కినేని రఘు, కల్లూరు సొసైటీ అధ్యక్షుడు, డీసీసీబీసెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, బీఆర్ ఎస్ మండల యూత్ అధ్యక్షుడు పెడకంటి రామకృష్ణ, నాయకులు ప్రసాద్, వెంకటేశ్వరరావు, కృష్ణ, రజనీకాంత్, ఎనోష్ కుమార్, వెంకటేశ్వరెడ్డి, నరసింహారెడ్డి, ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అలాగే ఎమ్మెల్సీ తాతా మధు మంగళవారం భద్రాచంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ​పాలన అంత రక్త చరిత్రేనని ఆరోపించారు. ప్రస్తుతం అదే పంథాలో ఆ పార్టీ హింసా రాజకీయాలను ప్రేరేపిస్తోందన్నారు.  కాంగ్రెస్, బీజేపీ డైవర్షన్ ​పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డిపై జరిగిన దాడిని ఈసీ సీరియస్​గా తీసుకోవాలన్నారు. ఆయన వెంట నాయకులు తెల్లం వెంకట్రావు, తిరుపతిరావు, రమేశ్​గౌడ్, తాండ్ర వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

75 వేల మందిని తరలిస్తున్నం

ఇల్లెందులో జరగబోయే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్ల మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్​మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం సభకు 75 వేల మందిని తరలిస్తున్నట్లు తెలిపారు. ఇల్లెందుకు కేసీఆర్​ రూ.కోట్ల నిధులు మంజూరు చేశారని తెలిపారు. బీఆర్ఎస్​పథకాలను మెచ్చిన జనమే స్వచ్ఛందంగా సభకు తరలిరానున్నారన్నారు.