ఏపీలోని బూతుల సంస్కృతిని తెలంగాణకు తెచ్చిన్రు : తాతా మధు

ఖమ్మం, వెలుగు : ఏపీలో ఉన్న బూతుల సంస్కృతిని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు తీసుకువచ్చారని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​ అధ్యక్షుడు తాతా మధు అన్నారు. సోమవారం జిల్లా బీఆర్ఎస్​ ఆఫీస్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో లాగానే, తెలంగాణలో కూడా కాంగ్రెస్​ నేతలు అరాచక పాలన చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్​ కంటే మెరుగ్గా పథకాలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి 60 రోజులు అయినా కాంగ్రెస్ పథకాలను పూర్తి స్థాయిలో అమలు 
చేయలేదన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నా బీఆర్ఎస్​ ప్రభుత్వంలో రైతు బంధు సరైన సమయంలో వేశామని గుర్తుచేశారు. జనవరి పెన్షన్లు ఇంతవరకు రాలేదని, రూ.4 వేలు కాదు.. కనీసం ఇంతకు ముందు ఇచ్చిన రూ.2వేలు అయినా ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్ గడిలో, కోటల్లో ఉన్నాడని ఎన్నికల ముందు విమర్శించి, ఇప్పుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదే కోటలో ఉంటున్నారని గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత దేశంలో కాంగ్రెస్ కనుమరుగు కావడం ఖాయమన్నారు. సమావేశంలో  డీసీసీబీ చైర్మన్​ కూరాకుల నాగభూషణం, పలువురు నేతలు పాల్గొన్నారు. 

Also Read : కడెం ప్రాజెక్టులో డెడ్​బాడీ లభ్యం