భద్రాచలం,వెలుగు: భద్రాచలం నియోజకవర్గానికి సీపీఎం, కాంగ్రెస్‌లు చేసిందేమీ లేదని ఎమ్మెల్సీ తాతా మధు ఎద్దేవా చేశారు. శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసి సోమవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూఅధికార పార్టీ ఎమ్మెల్యే అయితేనే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు వస్తాయన్నారు. నిధులు ఇవ్వాలని సర్కారును గతంలో పనిచేసిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అడగలేదని ఆరోపించారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం అభివృద్ధికి రూ.60కోట్లను కేసీఆర్ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి డా.తెల్లం వెంకట్రావు, పార్టీ మండలాల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండటం వల్లనే ఇక్కడ అభివృద్ధి జరగడం లేదని భద్రాచలంలో ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించడంతో సమావేశం రసాభాసగా మారింది.
- ALSO READ| అసమ్మతి అడ్రస్ లేకుండా చేయాలి: వద్ది రాజు
ఎంపీ, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు నిధులు ఎందుకు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించారు. వద్దిపేట, తాలిపేరు, పాలెం , ప్రగళ్లపల్లి సాగునీటి పథకాలకు నిధులు విడుదల చేయలేదని నిలదీశారు. దీనితో అసహనానికి గురైన ఎమ్మెల్సీ మధు ఎదురుదాడికి దిగడంతో విలేకర్లు తిరగబడ్డారు. సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేయడంపై నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్సీ దిగొచ్చి విలేకర్లతో ప్రశాంతంగా మాట్లాడారు.