ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన జర్నలిస్టుల ఇండ్ల సమస్యను సీఎం కేసీఆర్  త్వరలోనే పరిష్కరిస్తారని టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు. టీయూడబ్ల్యూయూజే(టీజేఎఫ్) నగర మహాసభను బుధవారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగిన సభకు ఎమ్మెల్సీతో పాటు సుడా చైర్మన్​ బచ్చు విజయ్ కుమార్, టీఆర్ఎస్​ సిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు, విద్యా సంస్థల చైర్మన్  ఆర్జేసీ కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా తాతా మధు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టుల్లో 80 శాతం నిరుపేదలేనని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. జర్నలిస్టు నాయకులు సయ్యద్ ఇస్మాయిల్, వెన్నబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీను, రామకృష్ణ, ప్రశాంత్ రెడ్డి, రజినీకాంత్, విజేత, మందటి వెంకటరమణ, పిన్నెల్లి శ్రీను, రాజు, నాగరాజు, ఈశ్వరి, సమ్మిరెడ్డి, ప్రసేన్, చిర్రా రవి, ఉద్యమకారుల ఫోరమ్ లీడర్ డాక్టర్  కేవీ కృష్ణారావు, 
తిరుపతిరావు పాల్గొన్నారు.

అండగా ఉంటా: మంత్రి అజయ్

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  తెలిపారు. హైదరాబాద్​లో ఉన్న మంత్రి సమావేశానికి హాజరు కాలేకపోవడంతో ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఖమ్మంలోని అర్హులైన ప్రతీ జర్నలిస్టుకు ఇంటి జాగా ఇప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. 


తొలిమెట్టు కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలి

వైరా, వెలుగు: తొలిమెట్టు కార్యక్రమాన్ని సక్సెస్​ చేసి విద్యార్థుల్లో కనీస సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్​ వీపీ గౌతమ్​ సూచించారు. బుధవారం వైరా రైతువేదికలో నియోజకవర్గ స్థాయి తొలిమెట్టు సమీక్ష సమావేశం నిర్వహించారు. వైరా, కొణిజర్ల, కారేపల్లి, ఏన్కూరు మండలాల ప్రైమరీ, అప్పర్​ ప్రైమరీ స్కూల్స్​ హెచ్ఎంలు​సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎస్​వో భాను ప్రసాద్, డీఈవో యాదయ్య, ఏఎంవో రవికుమార్ పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం, మినీ స్టేడియం పనులను పరిశీలించారు. మున్సిపాలిటీలో డంపింగ్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ అనిత, తహసీల్దార్ అరుణ పాల్గొన్నారు.

కల్లూరులో..
కల్లూరు పంచాయతీ పరిధిలోని నాగార్జునసాగర్ ప్రధాన కాలువపై ఎన్ఎస్పీకి చెందిన స్థలంలో ఏర్పాటు చేసిన విలేజ్ పార్కును, డబుల్ బెడ్రూం ఇండ్లను, మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియం పనులను కలెక్టర్  వీపీ గౌతమ్  పరిశీలించారు. సర్పంచ్ లక్కినేని నీరజ రఘును కలెక్టర్​ అభినందించారు. డంపింగ్ యార్డ్  కోసం స్థలం వినియోగించుకోకుండా ఎందుకు అభ్యంతరం చెపుతున్నారని ఎన్ఎస్పీ ఆఫీసర్లపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవో సీహెచ్ సూర్యనారాయణ, తహసీల్దార్​ బాబ్జి ప్రసాద్, ఇన్​చార్జి ఎంపీడీవో మహాలక్ష్మి, పీఆర్  ఏఈ వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి ఎస్  కృష్ణారావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్కినేని రఘు పాల్గొన్నారు.


న్యూట్రీ కిట్లను పకడ్బందీగా పంపిణీ చేయాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: న్యూట్రీ కిట్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆఫీసర్లను కలెక్టర్​ అనుదీప్​ ఆదేశించారు. కలెక్టరేట్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గర్భిణులకు  అన్ని పీహెచ్​సీల్లో న్యూట్రీ కిట్లను పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలో 7,360 గర్భిణులను గుర్తించామని, వారికి ఈ కిట్లను అందిస్తామని తెలిపారు. ప్రతీ రోజు 80 మందికి అందించేలా ప్లాన్​ చేసుకోవాలన్నారు. సబ్​ సెంటర్ల వారీగా షెడ్యూల్​ రూపొందించాలన్నారు. పీహెచ్​సీలకు గర్భిణులను తీసుకొచ్చేందుకు 102 వెహికల్స్​ వాడాలన్నారు. డీఎంహెచ్​వో డా.దయానందస్వామి, డిప్యూటీ డీఎంహెచ్​వో డా.సుకృత, ప్రోగ్రాం ఆఫీసర్​ డా.సుజాత, డాక్టర్​ చేతన్​ పాల్గొన్నారు.


మా భూములియ్యం.. అలైన్​మెంట్​​ మార్చుకోండి..   ఆర్డీవోకు తేల్చి చెప్పిన భూ నిర్వాసితులు

ఖమ్మం టౌన్, వెలుగు: మా భూములియ్యం.. అలైన్​మెంట్ ​మార్చుకోవాలని చింతకాని మండలం వందనం, కొదుమూరు గ్రామాలకు చెందిన భూనిర్వాసితులు స్పష్టం చేశారు. ఖమ్మంలోని ఆర్డీవో ఆఫీస్ లో బుధవారం హైవే కోసం భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. భూములు కోల్పోతున్న రైతులు ఆర్డీవో రవీంద్రనాథ్​ను కలిసి తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోమని చెప్పారు. రూట్  మ్యాప్  మార్చుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలోని 4 జిల్లాల్లో మార్చినట్లుగానే అలైన్​మెంట్ ​మార్చాలని అన్నారు. కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తమను ఆగం చేయొద్దని వేడుకున్నారు. కలెక్టర్  మ్యాప్  మార్చమని సూచించినా బేఖాతర్  చేయడం బాధాకరమన్నారు. ఆర్డీవోకు వినతిపత్రం ఇవ్వగా, ఆయన ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తానని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రైతు సంఘం లీడర్ బొంతు రాంబాబు, భునిర్వాసితులు పాల్గొన్నారు.