రేవంత్ రెడ్డిలో ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే కనిపిస్తుండు : ఎమ్మెల్సీ తాతా మధు

ఖమ్మం టౌన్, వెలుగు : ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును చూస్తే ఆయనలో ఏక్‌‌‌‌‌‌‌‌నాథ్ షిండే కనిపిస్తున్నాడని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు‌‌‌‌‌‌‌‌. బుధవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మహారాష్ట్ర, అస్సాంలో ఇలానే మాట్లాడిన వారు పార్టీ మారి మోదీకి మద్దతు పలికినవారేనని ప్రజలు గమనించాలని కోరారు. మోదీని రాహుల్ గాంధీ విమర్శిస్తుంటే..

రేవంత్ రెడ్డి మాత్రం ‘మోదీ మేరా బడా భాయ్’ అంటూ చెప్పడం వెనక ఆంతర్యమేంటో కాంగ్రెస్ నాయకులు చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 80 రోజులు దాటుతున్నా పెన్షన్, రైతుబంధు అమలు చేయలేదని విమర్శించారు. రాబోయే వేసవికాలంలో తాగునీటికి తిప్పలు,  కరెంటు కోతలు తప్పవని చెప్పారు. పార్లమెంట్​ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రేపు ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెం ప్రాంతంలోని వీవీసి  ఫంక్షన్ హాల్ లో రాజ్యసభ సభ్యుడు ‌‌‌‌‌‌‌‌వద్దిరాజు రవిచంద్ర సన్మాన సభ

కేసీఆర్ కృతజ్ఞత సభ ఉంటుందన్నారు. ఖమ్మం బైపాస్ రోడ్ లోని చెన్నై షాపింగ్ మాల్ పక్కన స్థలంలో గాయత్రి రవి, బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్నికల శంఖారావం పూరిస్తారని తెలిపారు. సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నట్లు చెప్పారు. సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, జిల్లా యువజన అధ్యక్షుడు చింత నిప్పు కృష్ణ చైతన్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఖమర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.