
- అన్ని రంగాల్లో బీసీల అణచివేత
న్యూఢిల్లీ, వెలుగు: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలను అన్ని రంగాల్లో అణచివేస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సామాజిక రంగాల్లో బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభత్వం చేసిన బిల్లులను కేంద్రం ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరుతూ.. బీసీ అజాదీ ఫెడరేషన్ అధ్యక్షుడు జక్కని సంజయ్ అధ్వర్యంలో ఢిల్లీలో తెలంగాణ భవన్‌లో బత్తుల సిద్ధేశ్వర్ చేపట్టిన బీసీ అజాదీ ఆమరణ నిరహార దీక్షకు ఆదివారం తీర్మార్ మల్లన్న సంఘీభావం తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీసీల హక్కుల సాధన కోసం బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి, పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జక్కని సంజయ్ మాట్లాడుతూ.. తాము బీసీల హక్కుల కోసం ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.
తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమేనని చెప్పుకునే లక్ష్మణ్, సంజయ్, ఇతర బీజేపీ బీసీ నేతలు.. రాష్ట్రంలోని బీసీ ప్రజల గురించి ఎందుకు ఆలోచిండం ప్రశ్నించారు. బీసీల అండ లేనిదే బీజేపీ ఎలా అధికారంలోకి వస్తుందో తాము చూస్తామన్నారు. బీసీ ప్రధానిగా చెప్పుకునే మోదీకి బీసీలపై ప్రేమ లేదా? అని ప్రశ్నించారు. 24 గంటల్లోగా మోదీ ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధికి దూరంగా ఉన్నారన్నారు. స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు బీసీల జనాభాను లెక్కించలేదని తెలిపారు. తెలంగాణ బీసీ బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. ఈ దీక్షలో రజక రిజర్వేషన్స్ పోరాట సమితి అధ్యక్షుడు చాపర్తి కుమార్ గాడ్లే, అంబేద్కర్ ఆజాదీ సంఘం అధ్యక్షుడు కొంగర నరహరి తదితరులు పాల్గొన్నారు.