బీసీల కోసం అవసరం అయితే ఎమ్మెల్సీ పదవి వదిలేస్తా: తీన్మార్ మల్లన్న

బీసీల కోసం అవసరం అయితే ఎమ్మెల్సీ పదవి వదిలేస్తా: తీన్మార్ మల్లన్న

హైదరాబాద్లోని తాజ్కృష్ణలో కుల జన గణన, స్థానిక సంస్థలలో రిజర్వేషన్ పెంపుపై సదస్సు తెలంగాణ బీసీ మేధావుల ఫోరం సదస్సు నిర్వహించింది. ఈ సదస్సులో మాజీ స్పీకర్ మధుసూధన చారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సామల వేణు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బండ ప్రకాష్, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ మధుసూదనా చారి మాట్లాడుతూ.. దేశాన్ని శాసిస్తుంది డబ్బు, రాజ్యాధికారం మాత్రమే అని చెప్పారు. భారత్లో బీసీలు 90% ఉన్నారని కానీ రాజ్యాధికారంలో మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించాలని వ్యాఖ్యానించారు. మనకు రావాల్సిన వాటా రావట్లేదని, ఎన్నో ఉద్యమాల్లో బీసీలు ముందున్నారని చెప్పారు. ఇప్పుడు మన కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, అందరం ఒక్కతాటిపై కలిసి పోరాడి, ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్సీగా గెలిచానంటే దానికి కారణం బీసీలు పెట్టిన భిక్షనే అని వ్యాఖ్యానించారు. పార్టీల పరంగా విభేదాలు ఉన్నా.. బీసీల కోసం అందరం ఒక్కతాటిపై నిల్చుంటామని స్పష్టం చేశారు. అవసరం అయితే ఎమ్మెల్సీ పదవిని వదిలేస్తానని తీన్మార్ మల్లన్న కీలక ప్రకటన చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినా తీసుకోనని, బీసీలే తనకు ముఖ్యం అని ఆయన చెప్పారు. బీసీల కులగణనకి జానారెడ్డి లాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారని,  బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు పదవులొద్దనే వైఖరితో ఉంటున్నారని ఆరోపించారు. కుల గణన చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, ఇది రాహుల్ గాంధీ మాట అని తెలిపారు. ఇది జరగకుంటే అగ్నిగుండం సృష్టిస్తామని తీన్మార్ మల్లన్న హెచ్చరించారు.

బీసీలలో ఐక్యత రావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. కుల గణన పెట్టిన తర్వాతే స్థానిక సంస్థలకి ఎన్నికలు పెట్టాలని, కులగణన మన ఒక్క రాష్ట్రంలోనే కాదని,  దేశమంతా జరగాలని డిమాండ్ చేశారు. భారత్లో మూడువేలకు పైగా బీసీ కులాలు ఉన్నాయని, అన్ని కులాలు ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. 75 ఏళ్ల తర్వాత రాజకీయ పార్టీలకు బీసీలు గుర్తుకొచ్చారని, ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్న వాళ్ళందరూ.. ఒకప్పుడు బీసీలను వ్యతిరేకించిన వాళ్ళేనని బండ ప్రకాశ్ విమర్శించారు. యూనివర్సిటీలలో, బ్యాంకింగ్ సెక్టార్ వంటి రంగాల్లో రిజర్వేషన్ సరిగ్గా అమలు అవ్వట్లేదని, కుల గణన లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని చెప్పారు. కుల గణన అనేది నాన్ పొలిటికల్ గానే ముందుకు వెళ్లాలని కోరుతున్నానని, జాతీయ స్థాయి సదస్సుని హైదరాబాద్లో నిర్వహించాలని బండ ప్రకాశ్ సూచించారు.