
- ప్రభుత్వంతో మాకు సమస్య లేదు.. కులగణన సర్వేను వ్యతిరేకిస్తున్నాం: తీన్మార్ మల్లన్న
- ఇప్పటికైనా సర్వే లెక్కలు సరిచూసుకోవాలని విజ్ఞప్తి
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ
హైదరాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్నందుకు కాంగ్రెస్‌కు, ఆ పార్టీ అధినాయకత్వానికి బీసీలు కృతజ్ఞతతో ఉన్నారని, ఇకపై కూడా ఉంటామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి సమస్య లేదని ఒక్క కుల గణన సర్వే విషయంలోనే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, కులగణన సర్వే లెక్కలను సరిచేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడంతోనే ఆ పార్టీలో చేరానని వెల్లడించారు.
తమ వాటాను సాధించుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గురువారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ‘‘కుల గణన సర్వేలో రాష్ట్ర జనాభాను ప్రభుత్వం ఎందుకు తక్కువ చేసి చూపిస్తుందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ 2024 సర్వే ప్రకారం రాష్ట్రంలో 4.21 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం చేసిన కులగణన వాస్తవమా, ఎనకామిక్ సర్వే వాస్తవమా చెప్పాలి. కులగణనలో ఓసీల జనాభాను ఎక్కువ చూపించి, బీసీల జనాభాను తక్కువ చేసి చూపారు. ఓసీల జనాభా ఎక్కువ చేసి చూపడం వల్ల పదికి పది శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి వస్తుంది.
తాను ఈడబ్ల్యూఎస్‌కు వ్యతిరేకం కాదు. జనాభాకు మించి రిజర్వేషన్ తీసుకోవడం వల్ల బీసీలు నష్టపోతున్నారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటివి జరగడం బాధాకరం”అని పేర్కొన్నారు. అలాగే, చట్ట సభల్లో మహిళలకు ఇవ్వనున్న 33 శాతం రిజర్వేషన్‌లో ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీల వాటా కూడా తేల్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. 2025-–26 బడ్జెట్‌లో బీసీలకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించాలి: నర్సిరెడ్డి
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ స్కూళ్లలోనే మౌలిక వసతులు కల్పించి స్టూడెంట్స్ సంఖ్యను పెంచేలా కృషి చేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మండలిలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఆయా ప్రాంతాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్మించాలని సూచించారు. పల్లెల్లో రైతు వేదికలు దీన స్థితిలో ఉన్నాయని, వాటిని రెనోవేట్ చేయాలని డిమాండ్ చేశారు.
సర్వేను రాజకీయం చేయొద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్
తీన్మార్ మల్లన్న ఆరోపణలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొన్న వారి వివరాలను మాత్రమే సేకరించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు అందరూ సర్వేలో పాల్గొన్నారని, హైదరాబాద్‌లో చాలా మంది సర్వేలో పాల్గొన లేదని పేర్కొన్నారు. సర్వే అంశాన్ని రాజకీయం చేయొద్దని, సూచనలు మాత్రం ఇవ్వాలని కోరారు.