రాబోయే నాలుగేళ్లలో బీసీలదే రాజ్యాధికారం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రాబోయే నాలుగేళ్లలో బీసీలదే రాజ్యాధికారం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • 2028లో బీసీ లీడర్​ సీఎం కావడం ఖాయం
  • పాలమూరు నుంచి బీసీ ఉద్యమాన్ని లేవనెత్తాలి
  • బీసీ రాజకీయ చైతన్య సదస్సులో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

పాలమూరు, వెలుగు :  రానున్న నాలుగేళ్లలో బీసీలకే రాజ్యాధికారం రాబోతోందని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న అన్నారు. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్​ ఫంక్షన్​ హాల్​లో ఆదివారం మధ్యాహ్నం బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'బీసీ రాజకీయ చైతన్య సదస్సు'కు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2028లో బీసీ లీడర్​ సీఎం కావడం ఖాయం అన్నారు.  

ఉమ్మడి జిల్లాకు చెందిన సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు తమ స్వలాభం కోసం ఎన్ని పార్టీలైన మారుతారన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు దామాషా ప్రకారం పదవులు కావాలని డిమాండ్ చేశారు.  సీఎం బీసీలను కోటీశ్వరులను చేస్తానని ప్రగల్బాలు పలికారని, అప్పులను బీసీలకు పంచి ఆస్తులను అగ్రకులాలు పంచుకుంటున్నాయని విమర్శించారు.

మహిళలకు ముద్ర లోన్ల పేరుతో మొత్తం రెండు వేల కోట్ల రూపాయలు లోన్లు పంచి, అందులో రూ.1,400 కోట్లు అగ్రకులస్తులకే ఇచ్చారన్నారు. బీసీల రాజ్యాధికారం కోసం తెగించి కొట్లాడి బరి గీసి నిలబడ్డానన్నారు. డబ్బులు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా బీసీ బిడ్డల బతుకులు మారాలని ప్రజాక్షేత్రంలో ఉన్నానన్నారు. బీసీలు అధైర్య పడొద్దని, బీసీ నిదానంతో వాటా దక్కించుకుందామన్నారు. ఎంబీసీ కులాలను కూడా కడుపులో పెట్టుకొని పోరాటం చేయాలన్నారు. 15 సీట్లు గెలిపించుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టాలన్నారు.

పాలమూరు జిల్లాలో ప్రతి ఇంటి నుంచి బీసీ నినాదం మొదలు కావాలన్నారు తెలంగాణ ఉద్యమాన్ని తలదన్నే విధంగా బీసీ ఉద్యమాన్ని లేవనెత్తాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సులో బీసీ జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త వట్టే జానయ్య యాదవ్, బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంగెం సూర్యారావు, తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్, బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ సాగర్, బీసీ జేఏసీ నాయకుడు మైత్రి యాదయ్య పాల్గొన్నారు.