
హైదరాబాద్, వెలుగు: కుల గణన సర్వే లెక్కల విషయానికి తాను పోవాలనుకోవట్లేదని, రాష్ట్ర ప్రభుత్వ లెక్కలను గౌరవిస్తున్నట్టు ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే 42% రిజర్వేషన్ కల్పించాలని, ఈ విషయంలో సీఎం రేవంత్‌తో పాటు కేసీఆర్, బీజేపీ నేతలు కూడా చొరవ చూపాలని కోరారు. శనివారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మల్లన్న మాట్లాడారు.
బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించిన సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారని, వాటికి పరిష్కార మార్గం చూపాలని కోరారు. దీనిపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేలోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.