
- పీసీసీ క్రమశిక్షణ కమిటీ లేఖ విడుదల
- పార్టీ లైన్ దాటితే ఎవరినీ ఉపేక్షించం: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. ఈ మేరకు శనివారం కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి లేఖను విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు వ్యతిరేకంగా తీన్మార్ మల్లన్న బహిరంగంగానే మాట్లాడడమే కాకుండా , దానికి సంబంధించిన ప్రతులను పబ్లిక్ గా చించేసి పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో గత నెల 5 న పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అదే నెల 12 లోపు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలని కూడా అందులో పేర్కొంది. కానీ తీన్మార్ మల్లన్న నుంచి పార్టీకి ఎలాంటి వివరణ రాలేదు. ఇచ్చిన గడువు కూడా ముగియడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హెచ్చరికలను పెడచెవిన పెట్టినందుకే: పీసీసీ చీఫ్ మహేశ్
తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ పై పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే ఎవరినైనా సరే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. మల్లన్న తమ హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతోనే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు వెల్లడించారు. బీసీ కుల గణన కాపీలను మల్లన్న చించడంపై పార్టీ హైకమాండ్ సీరియస్ అయిందని, అందుకే మల్లన్న విషయంలో అధిష్టానం కఠినంగా వ్యవహరించిందని అన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా చర్యలు తప్పవని చెప్పేందుకు మల్లన్న సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని మహేశ్ గౌడ్ తెలిపారు.