బీసీల ఆత్మగౌరవం దెబ్బతిస్తే సహించేది లేదు : తీన్మార్​ మల్లన్న

బీసీల ఆత్మగౌరవం దెబ్బతిస్తే సహించేది లేదు : తీన్మార్​ మల్లన్న
  • ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న  

హాలియా, వెలుగు : బీసీల ఆత్మగౌరవం దెబ్బతిస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న హెచ్చరించారు. హాలియాలో కవయిత్రి మొల్ల విగ్రహ ఏర్పాటును అడ్డుకున్న సందర్భంగా ఆదివారం పట్టణంలో జరిగిన నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. కుమ్మర సోదరులు మొల్లమాంబ విగ్రహాన్ని పెడుతుంటే దురుద్దేశంతో మాజీ సీఎల్పీ లీడర్​ జానారెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ నేతల విగ్రహాలను జేసీబీలతో తొలగిస్తే బీసీలంతా రాజకీయ పార్టీల నాయకుల కుర్చీలను కూల్చివేయాలన్నారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే  కేవలం ఒక బీసీ, ఒక ఎస్టీ, ఇద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారని, మిగిలిన 8 మంది రెడ్లు ఉన్నారని తెలిపారు. రాహుల్ గాంధీ ఒకవైపు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చెబితే.. జానారెడ్డి దానిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీలను అణగదొక్కేందుకు ఇన్ని రోజులు రాజకీయ నాయకులు చేసిన కుట్రలు చాలా ఉన్నాయని, రానున్న రోజుల్లో వాళ్ల పాప పరిహారం కింద పోతాయన్నారు. తెలంగాణలో బీసీల రాజ్యం రాబోతుందని, భవిష్యత్​లో మనమంతా ఐక్యంగా ముందుపోవడానికి నాంది పలకాలని పిలుపునిచ్చారు. త్వరలో నాగార్జునసాగర్ నియోజకవర్గంతోపాటు నల్లగొండ ఎన్జీ కాలేజీలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు.

 ఉమ్మడి జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఐక్యత కోసం సభలు నిర్వహిస్తామని చెప్పారు. హాలియా మున్సిపల్ చైర్మన్ పార్వతమ్మ పదవిని జానారెడ్డి తొలగించి నరేందర్ రెడ్డి అనే వ్యక్తికి కట్టబెట్టారని, బీసీ కులానికి చెందిన మార్కెట్ చైర్మన్ వెంకటేశ్వర్లు యాదవ్ ను పదవి నుంచి తొలగించి శేఖర్ రెడ్డి నియమించారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మేం ఓసీల ఓట్లను అడగబోమని, రెడ్లు కూడా బీసీల ఓట్లు అడగవద్దన్నారు. ఈడబ్ల్యూఎస్ తో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు.

 మొల్లమాంబ విగ్రహాన్ని అవమానించిన మున్సిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్​చేశారు. కార్యక్రమంలో కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు వట్టే జానయ్య, మహేశ్, బొడ్డుపల్లి చంద్రశేఖర్, సుదర్శన్,​ పొదిలి శ్రీనివాస్,​ నల్గొండ సుధాకర్, సైదులుగౌడ్ పాల్గొన్నారు.