మరో వివాదంలో పుష్ప2 మూవీ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

 మరో వివాదంలో పుష్ప2 మూవీ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు

అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీగా వచ్చి రికార్డులు సృష్టించిన పుష్ప2 సినిమా వివాదాల్లో చిక్కుకుంది. పుష్ప2 సినిమాపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సినిమాలో పోలీసలను కించపరిచే విధంగా సీన్లు ఉన్నాయని  మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ‘‘థియేటర్ కు వెళ్లి మరీ సినిమా చూశాను. సినిమాలో కొన్ని సన్నివేశాలు దారుణంగా ఉన్నాయి. పోలీసుల పట్ల చిన్నచూపు చూసే విధంగా సీన్లు ఉన్నాయి. సినిమాలో ఒక సీన్ లో గంధపు చెక్కల స్మగ్లర్ వచ్చి పోలీస్ ఆఫీసర్ కారును ఢీ కొడతాడు. పోలీస్ ఆఫీసర్ స్విమ్మింగ్ పూల్ లో పడిపోయిన తర్వాత ఏకంగా స్విమ్మింగ్ పూల్ లోనే యూరిన్ (మూత్రం) పోయడం పోలీసులను చాలా అవమానించడమే’’నని అన్నారు. 

ALSO READ | టాలీవుడ్ లో టెన్షన్..బెన్ఫిట్ షోలు, టికెట్ రేట్లపై హైరానా!

పోలీసులను అగౌరవ పరిచే ఇలాంటి సీన్లు తీసినందుకు డైరెక్టర్ సుకుమార్, ప్రొడ్యూసర్, హీరో అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెన్సార్ బోర్డు ఆ సీన్ కట్ చేయాల్సిందని, ఎందుకు అనుమతించిందో తెలియదని అన్నారు. ఇటువంటి సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారోనని విమర్శించారు.  స్మగ్లర్లను హీరోలాగా చూపిస్తే నేటి యువత చెడు మార్గంలో వెళ్తుందని, ఇది సమాజాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇటువంటి సినిమాలను నిషేధించి మంచి సినిమాలను ప్రోత్సహించాలని, పదిమందికి ఉపయోగపడే సినిమాలను తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటువంటి సినిమాలు తీసిన దర్శకనిర్మాతలు, నటించిన హీరోలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  డిమాండ్ చేస్తున్నా అని తీన్మార్ మల్లన్న తెలియజేశారు.