- ఢిల్లీ రైతుల పోరాటంలా బలమైన బీసీ ఉద్యమం రావాలి
- అగ్రకులాల వారు సీఎంలు అవుతున్నరు.. బీసీలు సర్పంచులు కాకూడదా: ఆర్.కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: అధికార పార్టీలో ఉన్నప్పటికీ, బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని.. పదవులకంటే బీసీలే ముఖ్యమని.. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ లక్డికపూల్లోని ఓ హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఢిల్లీ రైతుల తరహాలో బీసీ కులగణనపై బలమైన ఉద్యమం రావాలని కోరారు.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బడా పారిశ్రామిక వేత్తలు రూ. కోట్లు దోచుకొని పోతుంటే.. మనం ఇంకా బీసీల లెక్కల కాడనే ఉండటం బాధాకరమన్నారు. అగ్రకులాల కుట్రలను ఎదుర్కొవాలంటే.. పార్టీలకు అతీతంగా బీసీలు అంతా ఒక వేదిక మీదకు రావాలన్నారు. బీసీ కుల గణన విషయంలో రాహుల్ గాంధీ అనుకూలంగా ఉన్నారని.. రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చర్యలు ప్రారంభిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్అమలు చేయాలె
అగ్రకులాల నాయకులు సీఎంలు అవుతున్నారని, బీసీలు మాత్రం సర్పంచులు కూడా కాలేకపోతున్నారని ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కులగణన చేపట్టి, రిజర్వేషన్లు పెంచితేనే, కేంద్రం దిగివస్తుందని, అప్పుడే దేశవ్యాప్తంగా కుల గణన సాధ్యం అవుతుందన్నారు.
అందుకోసం బీసీలు పోరాటాలకు సిద్ధం కావాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. జనాభాలో శాశించే స్థాయిలో ఉన్న బీసీలు.. కులగణన చేయమని యాచించే దుస్థితిలో ఉండటం బాధాకరమని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, మధుసూదనాచారి, బీసీ నేతలు
లాల్ కృష్ణ, గుజ్జ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.