- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
మిర్యాలగూడ, వెలుగు : దశాబ్దాలుగా బీసీలను అన్ని పార్టీలు మోసం చేసి రాజ్యాధికారానికి దూరం చేశాయని, రాబోయే రోజుల్లో తెలంగాణలో ఇక బీసీలదే అధికారమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. మిర్యాలగూడ పట్టణంలో బీసీ రాజకీయ చైతన్య వేదిక కో–కన్వీనర్ అర్జున్, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ గర్జన బహిరంగ సభకు మల్లన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన బహిరంగ సభ ఆరంభం మాత్రమేనని, అసలు ఉద్యమం ముందుంటుందన్నారు.
ఇప్పుడు బీసీలంతా రాజకీయంగా చైతన్యమయ్యారని చెప్పారు. తెలంగాణలో చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, మిర్యాలగూడ ఓసీ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డేనని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ పేరిట ఉద్యోగాల్లో బీసీలకు అన్యాయం చేస్తున్నారన్నారని మండిపడ్డారు. బీసీలను రాజకీయంగా అణిచివేసిన నల్గొండ జిల్లాలోని ఆధిపత్య నేతలను రాజకీయ సమాధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో బీసీ బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. మిర్యాలగూడలో బీసీ గర్జన బహిరంగ సభ సక్సెస్ కాకుండా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుట్రలు చేశారని ఆరోపించారు.
మేము ఎన్నికల్లో ఓసీల ఓట్లు అడుగం.. మీరు బీసీల ఓట్ల అడగమని చెప్పే ధైర్యం ఉందా..? అని ప్రశ్నించారు. రానున్న టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సభలో శాసనమండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, సూరజ్ మండల్, వట్టే జానయ్య, తండు సైదులుగౌడ్, పిల్లి రామరాజు యాదవ్, చెరుకు సుధాకర్, బీసీ ఇంటలెక్చవల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.