ఈడబ్ల్యూఎస్ రద్దుకు పోరాడుతా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఈడబ్ల్యూఎస్ రద్దుకు పోరాడుతా : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఓయూ, వెలుగు: కేంద్రం తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ రద్దుకు పోరాడుతానని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చెప్పారు. విద్యార్థులు అనేకమైన సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా వాటిని పరిష్కరిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 55,143 ఉద్యోగాలను భర్తీ చేసినందుకు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను నిర్వహించారు. విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవత రాయ్ అధ్యక్షతన వహించారు. 

ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, తెలంగాణ విమెన్ కార్పొరేషన్ డెవలప్​మెంట్ అథారిటీ చైర్మన్ శోభారాణి, గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలన నిరుద్యోగ విద్యార్థులకు స్వర్ణ యుగం లాంటిదన్నారు. ప్రజా పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారన్నారు. ఎంతో మంది నిరుద్యోగులు గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో నేతలు గాల్ రెడ్డి హర్షవర్థన్ రెడ్డి, సరిత, ఏపూరి సోమన్న తదితరులు పాల్గొన్నారు. మరోవైపు,ఈ సభను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పలువురిని పోలీసులు అరెస్టు చేసి ఓయూ పీఎస్​కు తరలించారు.