యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం దర్శించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి గర్భగుడిలో స్వయంభూ నారసింహుడిని దర్శించుకుని ప్రధానాలయ ముఖమంటపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు నిర్వహించారు. మొదట ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో భాస్కర్ రావు లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు.
ఆలయంలో సండే సందడి..
ఆదివారం, సోమవారం వరుస సెలవులు రావడంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. ఆలయంలో చేపట్టిన సుదర్శన నారసింహ హోమం, నిత్య కల్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక భక్తులు జరిపించిన పలురకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.40,05,735 ఆదాయం సమకూరిందని ఆఫీసర్లు వెల్లడించారు.