12 జిల్లాల పరిధిలో 4 లక్షల గ్రాడ్యుయేట్లు ఉంటారని అంచనా
ఆఫీసుల్లో లేదా వెబ్ సైట్ లో నమోదుకు అవకాశం
నల్గొండ/వనపర్తి, వెలుగు: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1 నుంచి నవంబర్ 6వ తేదీ వరకు గ్రాడ్యుయేట్లు వారి ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 2015 నాటి ఓటరు జాబితా రద్దు చేయడంతో ఇప్పుడు అందరూ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలి. నవంబర్ 2017 ముందు డిగ్రీ కంప్లీట్ చేసినవారు ఓటరుగా నమోదుకు అర్హులు. దీంతోపాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో సాధారణ ఓటరు అయి ఉండాలి. ఆధార్ కార్డు, డిగ్రీ సర్టిఫికెట్, ఓటరు గుర్తింపు కార్డుతో అప్లై చేసుకోవాలి. అన్ని సర్టిఫికెట్లపై గెజి టెడ్ అధికారి సిగ్నేచర్ తప్పనిసరి. ఆర్డీవో, తహసీల్దారు ఆఫీసుల్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే www.ceotelanagana.nic.in వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు కూడా మూడు జిల్లాల్లో ఏదో ఒకచోట సాధారణ ఓటరుగా ఉంటే సరిపోతుంది. అర్హత వయసు 30 ఏళ్లుగా నిర్ధారించారు.
12 జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లు
ఎన్నిక జరిగే నియోజకవర్గ పరిధి పాత మూడు జిల్లాలే అయినప్పటికీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాక 12 జిల్లాలకు ఎన్నికల ప్రక్రియ విస్తరించింది. నల్గొం డ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జన గాం, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాలోని చేర్యాల, మద్దూరు, కొమురవెల్లి మండలాల వరకు నియోజకవర్గ పరిధి విస్తరించింది. వీటి పరిధిలో 23 మంది ఆర్డీవోలు, 186 మంది తహసీల్దార్లు ఉన్నారు. అయితే చాలా మండలాల్లో తహసీల్దార్లు, ఆర్ఐల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఓటరు నమోదు కార్యక్రమానికి ఇబ్బంది ఉండొచ్చని అధికారులు భావిస్తున్నా రు. 2015 ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,81,138 మంది ఉన్నారు. ఈసారి ఓటర్లు నాలుగు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పోటీకి అన్ని పార్టీలు రెడీ
ఎలక్షన్స్ వచ్చే ఏడాది ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో మాత్రం ఇప్పటినుంచే హడావిడి మొదలైంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా బీజేపీకి చెందిన సీనియర్ నేత రాంచందర్ రావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన తిరిగి పోటీలో ఉంటున్నట్లు ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో బీజేపీ శ్రేణుల కదలికలు పెరిగాయి. మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ సైతం తన పూర్వపు స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలని ఇండిపెండెంట్అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. మరోవైపు ఇటీవల జరుగుతున్న వరుస పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీపై గ్రాడ్యుయేట్లు అసంతృప్తిగా ఉన్నట్లు గుర్తించిన ఆ పార్టీ అధిష్టానం ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులను, 12 మంది ఎమ్మెల్యేలను అలర్ట్ చేసింది. దీంతో ఎక్కడికక్కడ టీఆర్ఎస్ నేతలు గ్రాడ్యుయేట్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం ఏఐసీసీ కార్యదర్శి డా. చిన్నారెడ్డి నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. పార్టీ నుంచి పోటీ చేయాలా.. ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలా అనే విషయమై కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ఆలోచనలో ఉన్నాయి.
For More News..