- ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధు
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ అవినీతి పాలనపై ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధిస్తున్నారని, తప్పులు బయటపడిన ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్ అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రుల అవినీతి తారాస్థాయికి చేరిందని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే అవినీతిని రోడ్డు మీద పెడుతున్నారన్నారు.
సీఎం సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారి దోచుకుంటున్నారని విమర్శించారు. ఈ అవినీతిని ప్రశ్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏదోరకంగా అరెస్టు చేయాలని ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ లాంటి తప్పుడు కేసులు పెట్టారని తెలిపారు. పౌర హక్కుల నేత హరగోపాల్ ను అరెస్టు చేయడమేనా ఇందిరమ్మ రాజ్యం అని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ నాలుగు సంక్షేమ పథకాల కోసం గ్రామ సభలు అంటూ కాలయాపన కోసమే కాంగ్రెస్ ప్లాన్ చేసిందన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్మన్ కమల్ రాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, నేతలు ఆర్జేసీ కృష్ణ, కార్పొరేటర్ శీలంశెట్టి వీరభద్రం పాల్గొన్నారు.