
తెలంగాణ రాష్ట్రంలో రెండు టీచర్ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి అందరి దృష్టి ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. మరో 3 రోజుల్లో పోలింగ్ ఉండడంతో అభ్యర్థులు ప్రచార పర్వంలో ఉన్నారు. పదవుల కోసం తప్ప ప్రజాసమస్యలు లేవనెత్తడం, ఆ సమస్యలు పరిష్కారం కావడం అత్యాశగానే ఉండటం శోచనీయం. ఎన్నికలలో గెలిచిన తర్వాత వారి పాత్ర కీలకంగా ఉండడం లేదు. ఇక నుంచి అయినా ఈ విధానంలో మార్పు రావాలి.
ఎవరు గెలిచినా, ఓడినా ప్రజల సమస్యల పట్ల అవగాహనతో ఉండి పరిష్కారం చేసేలా ఉండాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికలు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీల మద్దతుతో లేదా పరోక్ష సహకారంతో జరుగుతూనే ఉన్నాయి. మా సంఘం, మీ సంఘం అని కాకుండా సమాజం కోసం పనిచేయాలి.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తమ సమస్యలుగా పరిగణించి పరిష్కరించేందుకు కృషి చేయాలి. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాల పెంపు, మౌలిక వసతులు, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, నిరుద్యోగ సమస్యలపై అటు టీచర్ ఎమ్మెల్సీ, ఇటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరాటం చేయాలి.
ప్రభుత్వం వద్దకి నిరంతరం ప్రజల సమస్యలను తీసుకువెళ్లి ఎమ్మెల్సీలు పరిష్కరించాలి. ఇక టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్స్ లో 70% ఉన్న ప్రాథమిక స్థాయి టీచర్లకు ఓటుహక్కు లేకపోవడం శోచనీయం. రాబోయే కాలంలో అయిన ఎస్జీటీలకు ఓటుహక్కు కల్పించాలి.
- రావుల రామ్మోహన్ రెడ్డి-