హైదరాబాద్ నగరంలో చెరువులు, కుంటలు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన కబ్జాదారుల గుండెల్లో హైడ్రా దడ పుట్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు వెలిసిన ప్రాంతాల్లో రొజుకోచోట దర్శనమిస్తూ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. రాజకీయ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా తన పని తాను చేసుకుపోతోంది.
కూల్చకుండా స్టే ఇవ్వండి
ఇదిలావుంటే చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కాలేజీలు కట్టారని హైడ్రా పంపిన నోటీసులపై MLRIT సంస్థల అధినేత మర్రి లక్ష్మణ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అధికారులు కాలేజీ భవనాలు కూల్చకుండా స్టే ఇవ్వాలని మర్రి లక్ష్మణ్ రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం త్వరలోనే విచారణ జరపనుంది.
15 రోజుల్లో వివరణ ఇవ్వాలి
కాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారని నోటీసుల్లో పేర్కొంది. వీటిని చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో కట్టారని వివరించింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కాలేజీలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని తెలిపింది. దీంతో ఎక్కడ కూల్చేస్తారనే భయంతో MLRIT సంస్థల అధినేత హైకోర్టును ఆశ్రయించారు.