రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్లు, డీఎం సివిల్ సప్లయీస్ ఆఫీసులు, ఎంఎల్ఎస్ పాయింట్లలో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులదే హవా నడుస్తోంది. పర్మినెంట్ స్టాఫ్ లేకపోవడంతో కీలక బాధ్యతలన్నీ వాళ్లకే అప్పగించారు. నల్గొండ లాంటి పెద్ద జిల్లాలోనే డీఎం ఆఫీసులో రెగ్యులర్ ఉద్యోగులు ఐదుగురుంటే, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కింద 30 మందికి పైగా పని చేస్తున్నారు. వే బిల్లులు, బియ్యం ఎగుమతి వగైరా అన్నీ వాళ్లకే అప్పగించారు.
వీరంతా సుమారు 10 ఏండ్ల నుంచి ఒకేచోట తిష్టవేశారు. వీరిని కదిలించే సాహసం కూడా అధికారులు చేయలేకపోతున్నారు. ఇక పెద్దవూర, హాలియా బియ్యం కేసులో ఫేక్ బిల్లులు సృష్టించింది కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే కావడం గమనార్హం. సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి పెద్ద జిల్లాల్లో అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బినామీలుగా పెట్టుకుని ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారని ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్ఆఫీసర్ ఒకరు చెప్పారు.