ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాక్రే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. 2024, నవంబర్ 7 గురువారం ఆయన అమరావతిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ థాక్రే మాట్లాడుతూ.. సున్నితమైన మసీదులపై లౌడ్ స్పీకర్ల అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాకు అధికారం ఇవ్వండి, మహారాష్ట్రలోని ఏ మసీదుపైనా ఒక్క లౌడ్‌స్పీకర్ కూడా లేకుండా చూసుకుంటామని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ముస్లిం నాయకులు మహా వికాస్ అఘాడి కూటమికి ఓట్లు వేయాలని మసీదుల నుండి ఫత్వాలు జారీ చేస్తున్నారని రాజ్ థాక్రే ఆరోపించారు. ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మసీదు లౌడ్ స్పీకర్లను బలవంతంగా తొలగించారని గుర్తు చేశారు.
మరోవైపు.. ఎన్సీపీ (శరద్ వర్గం) చీఫ్ శరద్ పవార్పైన రాజ్ థాక్రే నిప్పులు చెరిగారు. శరద్ పవార్‌ను ‘‘సెయింట్ శరద్చంద్ర పవార్’’గా అభివర్ణించిన థాక్రే.. ఓబీసీ, మరాఠా వర్గాల మధ్య వివాదాలను ప్రేరేపించారని మండిపడ్డారు. కాగా, 2024, నవంబర్ 20వ తేదీన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 2024, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్న విషయం తెలిసిందే. రాజ్ థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ ఒంటరిగానే అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతోంది.