మరాఠీ మాట్లాడటం ఇష్టం లేకపోతే మహారాష్ట్ర విడిచి వెళ్లండి: MNS లీడర్ వార్నింగ్

 మరాఠీ మాట్లాడటం ఇష్టం లేకపోతే మహారాష్ట్ర విడిచి వెళ్లండి: MNS లీడర్ వార్నింగ్

ముంబై: మహారాష్ట్రలో మరోసారి భాషా వివాదం ముదురుతోంది. రాజ్ థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) మరాఠీ గుర్తింపు ఎజెండా అంశాన్ని మరోసారి లేవనెత్తుతోంది. ఈ క్రమంలోనే  ఎంఎన్ఎస్ ముంబై అధ్యక్షుడు సందీప్ దేశ్‌పాండే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసిస్తూ మరాఠీ మాట్లాడటం ఇష్టం లేని వారు మహారాష్ట్ర విడిచి వెళ్లాలని.. వారు మహారాష్ట్ర దోహ్రులు అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. 

‘‘మహారాష్ట్రలో నివసిస్తూ మరాఠీ మాట్లాడటం ఇష్టపడని వాళ్లు మహారాష్ట్రకు ద్రోహులు. మరాఠీ మాట్లాడటం ఇష్టం లేని మహారాష్ట్రను విడిచి వెళ్లండి. లేదంటే మహారాష్ట్ర ద్రోహులకు తగిన బుద్ధి చెప్తాం’’ అని దేశ్‌పాండే హాట్ కామెంట్స్ చేశారు. దేశ్‌పాండే చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

అసలు ఏం జరిగిందంటే..?

ఇటీవల గుడి పద్వా సందర్భంగా జరిగిన ర్యాలీలో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే మరాఠీ భాషాపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధికారిక ప్రయోజనాల కోసం బ్యాంకులు, ఇతర సంస్థల్లో మరాఠీని తప్పనిసరి చేయాలని ఎంఎన్ఎస్ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో నివసిస్తూ ఉద్దేశపూర్వకంగా మరాఠీ మాట్లాడని వారిని ఎంఎన్ఎస్ కార్యకర్తలు ఉపేక్షించరని హెచ్చరించారు. 

పార్టీ చీఫ్ రాజ్ థాక్రే ఆదేశాలకు అనుగుణంగా ఎంఎన్ఎస్ కార్యకర్తలు బ్యాంకులు, ఇతర సంస్థల్లో మరాఠీ భాష అమలు చేయాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే థానే, పూణే జిల్లాల్లోని వేర్వేరు బ్యాంకులకు చెందిన ఇద్దరు బ్యాంకు మేనేజర్లు కస్టమర్లతో మాట్లాడేటప్పుడు మరాఠీ భాషను ఉపయోగించకపోవడంపై ఎంఎన్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. 

బ్యాంకు సిబ్బందితో కార్మికులు తలపడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఎంఎన్ఎస్ మరాఠీ భాషా వివాదాన్ని రాజేయడంపై సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రియాక్ట్ అయ్యారు. మరాఠీ భాష వాడకాన్ని పట్టుబట్టడం తప్పు కాదు.. కానీ అలా చేసే క్రమంలో ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే దానిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. 

కాగా.. మరికొన్ని రోజుల్లో ముంబై, థానే, పూణే, నాసిక్, నాగ్‌పూర్ కార్పొరేషన్‌ ఎన్నికలతో పాటు లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్-ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరాఠీ భాషా ఎజెండాను ప్రధాన అస్త్రంగా ఎంచుకోవడం మహా పాలిటిక్స్‎లో హాట్ టాపిక్ గా మారింది.