- నేడు ప్రజాభవన్లో ప్రారంభించనున్న మంత్రి సీతక్క
హైదరాబాద్, వెలుగు: ఇందిరా మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా మహిళా సంఘాలకు సంచార చేపల విక్రయ వాహనాలను అందజేస్తున్నారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తొలి విడతలో 25 వాహనాలను లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ప్రజా భవన్ వేదికగా ఉదయం 9.30 గంటలకు మంత్రి సీతక్క చేతుల మీదుగా సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద సెర్ప్ ద్వారా స్వయంసహాయక బృందాలకు ఈ వాహనాలను పంపిణీ చేస్తున్నారు.
చేపలను విక్రయిస్తున్న మహిళలు, ఆసక్తిగల ఎస్ హెచ్ జీలను జిల్లా మత్స్య అధికారులు, డీఆర్‌డీవోలు ఎంపిక చేయగా.. కలెక్టర్లు ఆమోదించారు. పచ్చిచేపలతో పాటు చేపల వంటకాలను విక్రయించేలా సంచార చేపల విక్రయ వాహనాలు తయారు చేశారు. మొదటి దశలో జిల్లాకు ఒక వాహనం చొప్పున 32 వాహనాలు మంజూరు చేశారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.10 లక్షలు కాగా ఫ్యాబ్రికేషన్‌తో కలిపి రూ.10.38 లక్షలు. ప్రధాన మంత్రి మత్స్య సమృద్ధి యోజన (పీఎంఎంఎస్‌వై ) తో ఈ పథకాన్ని అనుసంధానం చేయనున్నారు. సెర్ప్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం 60 శాతం సబ్సిడీ ఇవ్వనుంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాల రూపంలో సమకూర్చనున్నది.