ఎప్పుడైనా గమనించారా? ఇంటర్నెట్ ఏదైనా ప్రొడక్ట్ గురించి వెతికితే, తర్వాత మిగతా యాప్స్ లో కూడా ఆ ప్రొడక్ట్ గురించిన యాడ్స్ వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? అంటే.. మనం ఏం చేస్తున్నామో... మన ఫోన్ గమనిస్తుందా? మన మాటలు రహస్యంగా ఎవరైనా వింటున్నారా?
మొబైల్ యాప్ లు యూజర్ల డేటాని దొంగిలిస్తున్నాయని, ప్రైవసీ ఉండట్లేదని చాలా సార్లు ఇష్యూ అయింది. దాని మీద క్లారిటీ తెచ్చేందుకు ఒక మొబైల్ సెక్యూరిటీ సంస్థ ఈ మధ్య కాలంలో ఓ పరిశోధన నిర్వహించింది..
అవే యాడ్స్ వస్తున్నాయా?
ఫేస్ బుక్, గూగుల్ లాంటి సంస్థలు యూజర్ల డేటాను సేకరించి, వాటిని కమర్షియల్. పర్పస్ కు వాడుకుంటున్నాయని చాలా మంది విమర్శిస్తున్నారు. మామూలుగా మాట్లాడేటప్పుడు.. ఏ ప్రొడక్ట్స్ గురించి అయితే టాపిక్ వస్తుందో సరిగ్గా అదే ప్రొడక్ట్స్ కి సంబంధించిన అడ్వర్ టైజ్ మెంట్లు ఫోన్లో కనిపిస్తున్నాయని చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో 'వందేరా' సంస్థకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణులు దీనిపై ప్రయోగాలు చేసి అసలు విషయం తేల్చారు.
ప్రయోగం చేసి..
ఒక శామ్ సంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ ను .. ఒక యాపిల్ ఐఫోన్ ను 'ఆడియో రూమ్'లో పెట్టారు. ఫేస్ బుక్, యూట్యూబ్, క్రోమ్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్, అమెజాన్ యాప్ లకు పూర్తి పర్మిషన్లు ఇచ్చారు. నిశ్శబ్దంగా ఉన్న మరో గదిలో ఇటువంటివే మరో రెండు ఫోన్లు పెట్టారు. ఇప్పుడు ఆడియో రూమ్ లో 30 నిమిషాల పాటు పెట్స్ ఫుడ్ కి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లను ప్లే చేశారు. ఆతర్వాత, ఫోన్లు తెరిచి అప్లికేషన్లను పరిశీలించారు. ఏ యాప్ లోనూ, ఏ వెబ్ సైట్ లోను వాటికి సంబంధించిన అడ్వర్టైజ్ మెంట్లు కనిపించలేదు.
ఈ ప్రయోగం చేసే ముందు ఫోన్లలోని బ్యాటరీ లెవెల్, డేటా యూసేజ్ని కూడా నోట్ చేసారు. ఈ ప్రయోగాన్ని మూడు రోజుల పాటు మళ్లీ మళ్లీ చేశారు. ఆడియో రూమ్ లో ఉన్న ఫోన్లకు, నిశ్శబ్ధంగా ఉన్న రూమ్లోఉన్న ఫోన్లకు అడ్వర్టైజ్ మెంట్స్ లో ఎలాంటి తేడాలు లేవని వాళ్లు గుర్తించారు. అలాగే అ ఫోన్లలో బ్యాటరీ, డాటా యూసేజ్ కూడా ఒకేలా ఉన్నాయని తేల్చారు.
ఒకవేళ మైక్రోఫోన్ ద్వారా. మాటలు రికార్డ్ చేసి గూగుల్, యాపిల్ లాంటి సంస్థలు తమ సర్వర్లకు పంపినట్టైతే.. డేటా యూసేజ్ లో ఎంతో కొంత తేడా వస్తుంది. కానీ ఈ ప్రయోగంలో అలాంటిదేమీ జరగలేదని సిస్టమ్స్ ఇంజనీర్ జేమ్స్ మాక్కూ తెలిపారు
మరో మార్గంలో కూడా...
'అయితే మనకు తెలియని మరో మార్గంలో డేటా చోరీ జరుగుతుండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే... యూజర్లను టార్గెట్ చేయడానికి అడ్వర్టైజ్ మెంట్ ఏజంట్ల దగ్గర చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయ్. ఉదాహరణకు లొకేషన్ దాటా బ్రౌజింగ్ హిస్టరీ, ట్రాకింగ్ పిక్సెల్స్. ఇలాంటివన్నీ మనం వేటి కోసం సెర్చ్ చేస్తున్నాం అన్న సమాచారాన్ని అందిస్తుంటాయి' అని ఆయన చెప్పారు.
టెక్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు మైక్రోఫోన్స్ ఉపయోగించి, యూజర్ల మాటలు వింటున్నాయనే వాదనలను తిరస్కరిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ.. జరుగుతున్న సైబర్ క్రైమ్స్ వల్ల మొబైల్ యాప్స్ గూగుల్ వాట్సాప్, ఫేస్ బుక్ సంస్థల మీద ఎప్పుడూ ఏదో ఒక కంఫ్రంట్ వస్తూనే ఉంది.
-వెలుగు.. లైఫ్–