ఆన్లైన్ క్లాసుల వల్ల సేల్స్ పెరిగాయ్
పండగ సీజన్‌లో మరింత డిమాండ్
పలు ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తాం: సెల్ బే ఎండీ నాగరాజు
హైదరాబాద్, వెలుగు: నిత్యావసరంగా మారిన మొబైల్ ఫోన్ అమ్మకాలు కరోనా కాలంలోనూ తగ్గలేదని, తెలంగాణ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ రిటైల్ స్టోర్లు నిర్వహించే సెల్ బే మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు అన్నారు. కరోనా ముందు కాలంతో పోలిస్తే ఇప్పుడు సేల్స్ పెరిగాయని, ఆన్లైన్ క్లాసులు పెరగడమే ఇందుకు కారణమని వివరించారు. మన రాష్ట్రంలో మొబైల్ రిటైల్ మార్కెట్ కు మంచి భవిష్యత్ ఉందని, తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ‘వెలుగు’కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: కరోనా కాలంలో సేల్స్ ఎలా ఉన్నాయి ? ఇక ముందు ఎలా ఉంటాయని అంచనా వేస్తున్నారు?
కరోనా ఉన్నప్పటికీ అమ్మకాలు 20 శాతం పెరిగాయి. రూ.పది వేలలోపు రేటు ఉన్న ఫోన్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. ఫోన్ కస్టమర్లలో 70 శాతం యువతే ఉన్నారు. అంటే 30 ఏళ్లలోపు వయసువాళ్లు ఎక్కువ! స్కూళ్లు, కాలేజీలు ఆన్లైన్ క్లాసులను పెట్టడంతో ప్రతి ఒక్క కుటుంబం సెల్ ఫోన్ కొనడం అనివార్యంగా మారింది. ట్యాబ్ లకు కూడా చాలా డిమాండ్ ఉంది కానీ సప్లై లేదు. నిజానికి మొబైల్ ఫోన్ల సప్లై కూడా తగ్గింది. డిమాండ్ సప్లైలో తేడా వల్ల వీటి ధరలు పెరిగాయి. షావోమీ బ్రాండ్ల ఫోన్లను ఎక్కువ మంది అడుగుతున్నారు. మున్ముందు సేల్స్ కచ్చితంగా పెరుగుతాయి.
ప్రశ్న: ఫెస్టివల్ సీజన్ ఎలా ఉండొచ్చని అనుకుంటున్నారు ?
సేల్స్ 50 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మేం రోజుకు 1,400 వరకు మొబైల్స్ అమ్ముతాం. ఇప్పుడు 54 షోరూమ్స్ ఉండగా, వీటిని రెట్టింపు చేస్తాం. మేం 5,800 పిన్ కోడ్ లలో గంటలోపే డెలివరీ ఇస్తున్నాం. కస్టమర్లు ఫోన్ స్వయంగా చెక్ చేసుకొని కొనడానికి ఇష్టపడుతున్నారు. రిటైల్ స్టోర్లకు వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది కాబట్టే ఆన్లైన్ షాపింగ్ కంపెనీలు కూడా టచ్ అండ్ ఫీల్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాయి. రిటైల్ స్టోర్ లో ఫోన్ కొన్న తరువాత కూడా ఏడాది వరకు ఏదైనా సమస్య వస్తే కంపెనీలను సంప్రదించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం.
ప్రశ్న:డొమెస్టిక్ బ్రాండ్ల అమ్మకాలు ఎలా ఉన్నాయి ?
యాంటీ చైనా సెంటిమెంట్ వల్ల డొమెస్టిక్ బ్రాండ్లకు డిమాండ్ మెల్లమెల్లగా ఆదరణ పెరుగుతున్నది. మన దేశంలో మొబైల్ తయారీ మరింత పెరుగుతుంది. మరిన్ని కంపెనీలు ఇక్కడే అసెంబ్లింగ్ ప్లాంట్లు, ఆర్ అండ్ డీ సెంటర్లను ఏర్పాటు చేస్తాయి. చైనా కంపెనీలకు భారీగా ఇన్వెస్ట్మెంట్లు ఉండటం, ఎన్నో మార్కెట్లలో సేల్స్ చేయడం వల్ల అవి తక్కువ రేట్లకు ఫోన్లను అమ్ముతున్నాయి. మేకిన్ ఇండియా కార్యక్రమం వల్ల మనదేశంలో మొబైల్స్ తయారీ (డొమెస్టిక్ బ్రాండ్లు) మాన్యుఫాక్చరింగ్ పెరుగుతుంది.
ప్రశ్న: సెల్ ఫోన్ల తోపాటు కొత్త ప్రొడక్టులు ఏం అమ్ముతున్నారు ?
ఎంఐ, ల్యూమిఫోర్డ్ వంటి బ్రాండ్ల స్మార్ట్ టీవీలు మా దగ్గర దొరుకుతాయి. అన్ని ఫోన్ల యాక్సెసరీలు, బ్లూటూత్ స్పీకర్లు వంటి వాటివి మా దగ్గర కొనుక్కోవచ్చు. ఇక నుంచి స్మార్ట్ వాచీలు కూడా అమ్మాలని నిర్ణయించాం. మొబైల్ సహా అన్ని రకాల రేడియేషన్ తగ్గించే ప్యూరిఫయర్ను ప్రత్యేకంగా అమ్ముతున్నాం. ఎన్విరానిక్స్ అనే కంపెనీ దీనిని తయారు చేసింది. సోలార్ పవర్తో పనిచేసే దీనిని ఇంట్లో పెట్టుకుంటే మనం రేడియేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చు. రేడియేషన్ ప్యూరిఫయర్ ధర రూ.నాలుగు వేలు ఉంటుంది. ఆక్సీమీటర్లను కూడా అమ్ముతున్నాం. వీటిపై మార్జిన్ తీసుకోవడం లేదు.
ప్రశ్న: బిజినెస్ ను ఇంకా పెంచేందుకు ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా ?
మా షోరూమ్లను తప్పకుండా పెంచుతాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు స్టోర్ల సంఖ్య 100కు తీసుకెళ్తాం. ప్రస్తుతానికి మా దృష్టి అంతా తెలంగాణ వైపే ఉంది. ఏపీలో స్టోర్లు పెట్టే ఆలోచన ఇంకా లేదు. మన రాష్ట్రంలో మొబైల్ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. మేం పోటాపోటీ రేట్లకు ఫోన్లు అమ్ముతున్నాం. ఆఫ్టర్ సేల్స్ సర్వీసు కూడా ఇస్తాం కాబట్టి కస్టమర్లు సెల్బేను ఇష్టపడుతున్నారు. మాకు రెండు లక్షల వరకు కస్టమర్ల బేస్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో భారీగా రెవెన్యూ సాధించాం. వచ్చే ఏడాది ఇది మూడింతలు పెరుగుతుందన్నది మా అంచనా.