ఫోన్​ నీళ్లలో పడిందా..?: ఇలా చేయండి..!

ఫోన్​ నీళ్లలో పడిందా..?: ఇలా చేయండి..!

పొరపాటున కానీ, పిల్లల వల్ల కానీ కొన్నిసార్లు మొబైల్​ ఫోన్​ నీళ్లలో పడే అవకాశం ఉంది. పైగా ఇది వర్షాకాలం. కొన్నిసార్లు ఫోన్​ వర్షానికి తడిసిపోవచ్చు కూడా. ఫోన్ నీళ్లలోపడ్డా, తడిసినా వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది పాడయ్యే అవకాశం ఉంది. ఫోన్​ నీళ్లలో పడగానే చాలా మంది చేసే పొరపాటు ఫోన్​ ప్యానెల్స్​ ఓపెన్​ చేసి ఎండలో పెట్టడం లేదా హాట్​ ఎయిర్ హెయిర్​ డ్రయ్యర్​వాడటం. దీనివల్ల ఫోన్​ లోపలి భాగాల్లోకి చొచ్చుకుపోయిన నీళ్లు ఆవిరి రూపంలో బయటికి వెళ్లిపోతాయని భావిస్తారు.

ఇది సరైన పద్ధతి కాదు. ఎండ వేడి లేదా హాట్​ ఎయిర్​ ప్రభావానికి ఫోన్​ లోపల ఉండే సున్నితమైన సర్క్యూట్​ వంటివి కరిగిపోయే ప్రమాదం ఉంది. ఫోన్​ లోపలి భాగాలు ఎక్కువ వేడికి పాడవ్వొచ్చు. అందువల్ల ఫోన్​ను ఎండలోపెట్టడం కానీ, హెయిర్​ డ్రయ్యర్​ వాడటం కానీ చెయ్యొద్దు. సాధారణ గది ఉష్ణోగ్రతవద్దే ఉంచాలి.

తడిగా ఉన్న ఫోన్​ పూర్తిగా ఆరేవరకు చార్జింగ్​ పెట్టకూడదు. ఒకవేళ చార్జింగ్​ పెడితే ఫోన్​ పాడవడమే కాకుండా, షాక్​ కొట్టే ప్రమాదం ఉంది. ఫోన్​ తడిసినప్పుడు హెడ్​ఫోన్స్​ పెట్టుకుని పాటలు వినకూడదు. దీనివల్ల షాక్​ తగిలే  అవకాశం ఉంది. సిమ్​ ట్రే వెంటనే ఓపెన్​ చేయకూడదు. దీనివల్ల నీళ్లు లోపలికి వెళ్లే అవకాశం ఉంది. తడిగా ఉన్న ఫోన్​ను షేక్​చేయకూడదు. దీనివల్ల నీళ్లు బయటకు రావడం కాకుండా, లోపలి భాగాలకు వెళ్లి, ఫోన్​ పాడయ్యే అవకాశం ఉంది.

ఫోన్​ పూర్తిగా ఆరేదాకా వాడకుండా స్విచాఫ్​ చేయాలి. వాల్యూమ్, పవర్​ ఆఫ్/ఆన్​ బటన్స్​ అనవసరంగా ప్రెస్​ చేయకూడదు. ఫోన్​లోపలికి గాలి ఊదకూడదు. దీనివల్ల తేమ మరింతగా లోపలికి వెళ్తుంది. ఫోన్​ కాస్త తడిగా ఉంటే బియ్యంలో ఉంచి, ఆ డబ్బాను గట్టిగా ముయ్యాలి. బియ్యం తేమను పీల్చుకుంటుంది. లేదంటే మార్కెట్లో ఫోన్​ డ్రయ్యింగ్​ పౌచెస్​ దొరుకుతాయి. వాటిని వాడొచ్చు.

పర్సులు, షూ, హ్యాండ్ బ్యాగ్స్​ వంటి ప్యాకెట్లలో వచ్చే సిలికా జెల్​ను కూడా వాడొచ్చు. వీటిని ఒక డబ్బాలో, మొబైల్​తోపాటుగా ఉంచితే తేమను పీల్చుకుంటాయి. కాటన్​ క్లాత్​తో సున్నితంగా, మెల్లిగా ఫోన్​ తుడవాలి. ఫోన్​ నీళ్లలో ఎక్కువగా తడిసే అవకాశంఉన్నవాళ్లు వాటర్​ రెసిస్టెంట్​ ప్యానెల్స్, బ్యాక్​పౌచెస్​ వాడాలి. తడిగా ఉన్నంతసేపు ఫోన్​ వాడకుండా పక్కనపెట్టాలి. ఎక్స్​పీరియెన్స్​ ఉన్న టెక్నీషియన్స్​తోనే రిపేర్​ చేయించుకోవాలి.