ఈ మోడల్ కు బిడ్డ పుట్టే వరకు తెలియదట.. తను ప్రెగ్నెంట్ అని.!

ఈ మోడల్ కు బిడ్డ పుట్టే వరకు తెలియదట.. తను ప్రెగ్నెంట్ అని.!

అమ్మతనం.. ప్రతి తల్లి ఆనందించే విషయం. కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా కాచుకుంటారు బిడ్డని. ఆ క్షణం నుంచి 9 నెలలు నిండేదాకా బరువును మోస్తుంది. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన ఒక మోడల్​ మాత్రం, బిడ్డ పుట్టే వరకు తను ప్రెగ్నెంట్​ అన్న విషయం తెలియదంటోంది. గర్భిణులకు ఉండేలా పొట్ట ఉబ్బెత్తుగా కూడా లేదంటోంది. అవును! ప్రెగ్నెంట్​ అయితే తెలియకుండా ఉంటుందా? అన్న డౌట్​ రావొచ్చు. కానీ, ఇటీవల ఆస్ట్రేలియా మేగజీన్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆ విషయం చెప్పింది. ఆ మోడల్​ పేరు ఎరిన్​ లాంగ్​మెయిడ్​. కడుపు పెద్దగా లేకపోవడం, ఆ లక్షణాలూ తనలో కనిపించకపోవడంతో ప్రెగ్నెంట్​ అన్న విషయం తెలియలేదని చెబుతోంది. బాత్రూంలో బిడ్డను కనే 10 నిమిషాల ముందు వరకూ మామూలు మనిషిలాగే ఉన్నానని చెప్పింది. గర్భం రాకుండా కాంట్రసెప్టివ్​ పిల్స్​ వాడానని, కానీ, అవేవీ పనిచేయలేదని తెలిపింది. ఇటీవలే తన పాప, భర్త డాన్​ కార్టీతో కలిసి దిగిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది లాంగ్​మెయిడ్​. పాపకు ఐలా అని పేరుపెట్టారు. 3.6 కిలోల బరువుతో ఆరోగ్యంగా పుట్టింది ఐలా.

2500 మందిలో ఒకరికి

ఇలాంటి ప్రెగ్నెన్సీ ప్రతి 2500 మందిలో ఒకరికి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దాన్నే స్టెల్త్​ లేదా క్రిప్టిక్​ ప్రెగ్నెన్సీ అని చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో కడుపుతో ఉన్నామన్న విషయం ఆ మహిళలకు తెలియదంటున్నారు. ప్రతి 475 మందిలో ఒకరికి, 20 వారాలు వచ్చాక ప్రెగ్నెంట్​ అన్న విషయం తెలుస్తుందని చెబుతున్నారు.

మరికొందరు నిపుణులు మాత్రం దానిని డినైడ్​ ప్రెగ్నెన్సీస్​ అనీ చెబుతున్నారు. అంటే సైకలాజికల్​ కారణాలతో తాము ప్రెగ్నెంట్​ అన్న విషయాన్ని గుర్తించకపోవడమే డినైడ్​ ప్రెగ్నెన్సీ అని అంటున్నారు. అయితే, క్రిప్టిక్​ ప్రెగ్నెన్సీ అనేది ఇటీవలి కాలంలోనే ఎక్కువగా జరుగుతోందని చెబుతున్నారు. శరీర తత్వాలకు తగ్గట్టు కొందరికి కడుపు పైకి కనిపించదని, లోపలా మార్పులు జరుగుతున్నట్టు అనిపించదని చెబుతున్నారు. అయితే, ఎవరికి, ఎప్పుడు ఇలా జరుగుతుందన్నది మాత్రం నిపుణులు చెప్పలేకపోతున్నారు. క్రిప్టిక్​ ప్రెగ్నెన్సీకి గల బయోలాజికల్​ కారణాలను అంచనా వేయడం కష్టమంటున్నారు. ప్లేసెంటా (మాయ) ఉండే పొజిషన్​ వల్ల బిడ్డ కదలికలు తల్లికి తెలుస్తాయని, దాని పొజిషన్​లో తేడాల వల్ల కూడా ప్రెగ్నెంట్​ అన్న విషయం కొందరికి తెలియదని, కదలికలూ గుర్తించలేరని  ఫ్లోరిడాకు చెందిన గైనకాలజిస్ట్​ క్రిస్టిన్​ గ్రీవ్స్​ చెప్పారు.