తెలంగాణ తల్లి నమూనా రెడీ.. ఆకుపచ్చ చీర.. చేతిలో వరి, మక్క..!

  • జొన్న, సజ్జ కంకులు.. పీఠంపై పిడికిళ్లు
  • మెడలో గుండ్లు, కంటె.. తెలంగాణ సగటు మహిళలా రూపం
  • ఎల్లుండి సెక్రటేరియెట్​లో 17 అడుగుల విగ్రహావిష్కరణ

హైదరాబాద్​, వెలుగు: సెక్రటేరియెట్​లో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అంటూ ఓ ఫొటో శుక్రవారం బయటకు వచ్చింది. తెలంగాణ సగటు మహిళను తలపించేలా తెలంగాణ తల్లి ఉన్నది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది. మెడలో గుండ్లు , యెనల దండ, కంటె.. చెవులకు కమ్మలు.. కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు, ఎడమ చేతిలో వరి, మక్క, జొన్న, సజ్జ కంకులు పట్టుకొని పల్లె వాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపం ఉంది. 

ఉద్యమ ఆకాంక్షలను చాటేలా గద్దెను రూపొందించారు. గద్దెకు అడుగుభాగాన ఉద్యమ పిడికిళ్లు ఉండగా.. మధ్యలో సబ్బండ వర్గాల చేతులు ఆ గద్దెను ఎత్తిపట్టుకున్నట్టు తీర్చిదిద్దారు. కాగా, ఈ నమూనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వజ్రవైఢూర్యాలు, కిరీటాలు, భుజకీర్తులు లేకుండా మన తల్లిని యాదిజేస్కునేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

17 అడుగుల కాంస్య విగ్రహం

సెక్రటేరియెట్​లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపొందిస్తున్నది. 17 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని  ఇప్పటికే సెక్రటేరియెట్​ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా.. కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణా రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు.

 ‘‘తాజా తెలంగాణ తల్లి విగ్రహం సంప్రదాయపు స్త్రీ మూర్తిగా, సబ్బండవర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజానీక సంస్కృతికి భిన్నంగా, రాచరికపు హావభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారు. ఈ కారణంగా చాలామంది ప్రజలమన్ననలు పొందలేకపోయింది” అని ఆయన పేర్కొన్నారు.