మోడల్ ఆత్మహత్య ఎఫెక్ట్: మహారాష్ట్రలో మంత్రి సంజయ్ రాథోడ్ రాజీనామా

ముంబై: టిక్ టాక్ స్టార్, టీవీ నటి, మోడల్ పూజ చవాన్ (22) ఆత్మహత్య వ్యవహారం మహారాష్ట్రలో రాజకీయంగా పెనుదుమారం సృష్టిస్తోంది. మరింత ఆలస్యం చేస్తే పరిస్థితి చేయిజారిపోతుందేమోనన్న అనుమానంతో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. శివసేన మంత్రి సంజయ్ రాథోడ్ తో రాజీనామా చేయించారు. గత ఫిబ్రవరి నెల 8వ తేదీన మోడల్ పూజ చవాన్ పూణె నగరంలోని ఓ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మోడల్ పూజ మృతికి మంత్రి సంజయ్ రాథోడే కారణమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రోజులు గడిచేకొద్దీ మోడల్ కు సంబంధించిన పాత వీడియోలు.. ఫోటోలతో గాసిప్ లతో సోషల్ మీడియాలో గరం గరం మసాలా వార్తలను షేర్ చేస్తుండడం దుమారం రేపుతోంది. రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించే దిశలో వెళుతుండడంతో బాధ్యుడిగా.. ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సంజయ్ రాథోడ్ తన భార్యతో కలసి ఆదివారం సీఎం ఉద్దవ్ థాకరతేతో సమావేశమయ్యారు. మోడల్ తో వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధాలు లేవని, తన భార్యకు కూడా తెలుసంటూ ఆమె సమక్షంలోనే అన్ని విషయాలు సీఎంతో చర్చించారు. మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తోపాటు.. బీజేపీ నేతలు పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేస్తుండడంతో శివసేన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని.. సీఎం ఉద్దవ్ థాకరే చెప్పడంతో మంత్రి సంజయ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా నిర్ణయాన్ని వెంటనే మీడియాకు వెల్లడించారు. తన రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని మంత్రి రాథోడ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. బంజారా సామాజిక వర్గానికి చెందిన ఓ యువతి చనిపోవడం దురదృష్టకరమని, ఈ ఘటనతో రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ప్రయత్నించడం దారుణమన్నారు. నిజానిజాలు తొందర్లోనే అన్నీ బయటకు వస్తాయని.. కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదనే తాను మంత్రి పదవికి రాజీనామా చేశానన్నారు. రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ థాకరేకు ఇచ్చేశానని.. వాస్తవాలు దర్యాప్తులో బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు…ఇప్పుడు బస్సు డ్రైవర్లు

పార్టీ సభ్యత్వం ఉంటేనే ప్రభుత్వ పథకాలు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ

ఫామ్ హౌస్ కి కాపలా కాసేందుకే పోలీస్ శాఖలో భర్తీలు