న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం మొదటి రోజున ఈక్విటీ మార్కెట్లు లాభాలను సంపాదించాయి. రెండు రోజుల నష్టాలకు బ్రేకులు వేశాయి. బ్లూచిప్స్టాక్స్లో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సెన్సెక్స్ 368 పాయింట్లు పెరిగి 78,507 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఇది 617 పాయింట్ల వరకు దూసుకెళ్లి 78,756 పాయింట్లకు చేరుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 98.10 పాయింట్లు పెరిగి 23,742 వద్ద ఆగింది. ఇందులోని 37 షేర్లు లాభాల్లో, మిగతా షేర్లు నష్టాల్లో ముగిశాయి.
సెన్సెక్స్ప్యాక్నుంచి మారుతి, మహీంద్రా అండ్మహీంద్రా, ఎల్ అండ్ టీ, బజాజ్‌ఫైనాన్స్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆక్సిస్బ్యాంక్ లాభపడ్డాయి. టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జొమాటో, హెచ్‌సీఎల్‌టెక్, ఎస్బీఐ, హెచ్‌యూఎల్, టెక్‌మహీంద్రా నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 1.03 శాతం, మిడ్‌క్యాప్ 0.50 శాతం పెరిగాయి. సెక్టోరల్ ఇండెక్స్‌లలో మెటల్, రియల్టీ మాత్రమే వెనకబడ్డాయి.
బీఎస్ఈలో 2,741 స్టాక్స్ లాభపడగా, 1,241 స్టాక్స్నష్టపోయాయి. ఎఫ్ఐఐలు మంగళవారం రూ.4,645 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. ఆసియా, యూరప్ మార్కెట్లలో చాలా వరకు కొత్త సంవత్సరం సెలవు కారణంగా పనిచేయలేదు. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బ్రెంట్‌క్రూడ్ ధర బ్యారెల్‌కు 0.88 శాతం పెరిగి 74.64 డాలర్లకు చేరుకుంది.