
వరంగల్‌లో మాటలకే పరిమితమైన ముంపు నివారణ చర్యలు
ముందస్తు చర్యలు లేక మునుగుతున్న కాలనీలు
పట్టించుకోని లీడర్లు, లైట్ తీసుకుంటున్న గ్రేటర్ పాలకులు
హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ నగరంలో మోస్తరు వర్షం పడినా రోడ్లు నీటమునుగుతున్నాయి, కాలనీలు జలమయం అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం పడిన ప్రతీసారి జనాలు ఇండ్లు విడిచి పునరావాస కేంద్రాల బాట పట్టాల్సి వస్తోంది. కాలనీలు, రోడ్లపై వరద నిల్వ ఉండకుండా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఏటా సేమ్ సీన్ రిపీట్‌అవుతున్నా సమస్య పరిష్కారానికి మాత్రం ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రపోజల్స్‌కే పరిమితమైన హామీలు
వరంగల్ ట్రై సిటీ 2016 సెప్టెంబర్‌లో ఒకసారి, 2020 ఆగస్టులో మరోసారి భారీ వర్షాలకు అతలాకుతలమైంది. వరద తాకిడికి రోడ్లు, డ్రైనేజీలు పెద్దఎత్తున దెబ్బతినడంతో రూ.కోట్లలో నష్టం వాటిల్లింది. రోడ్లు, కాలనీలు నదులను తలపించడంతో బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2020 ఆగస్టు వరదల తర్వాత మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించి ముంపు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్థానిక ఆఫీసర్లు రూ. 250 కోట్లతో ప్రపోజల్స్ పంపించారు. కానీ తర్వాత ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో నగరానికి ముంపు ముప్పు తప్పడం లేదు. ముఖ్యంగా వరంగల్‌లో ముంపునకు కారణమయ్యే బొందివాగు నాలా డెవలప్‌మెంట్ వర్క్స్ ముందుకు కదలడం లేదు.
ముందుచూపు కరువు
నగరంలో ముంపు సమస్య ఏర్పడకుండా బల్దియా ఆధ్వర్యంలో ఏటా మాన్‌సూన్ యాక్షన్ ప్లాన్ రెడీ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా తరచూ ముంపునకు గురయ్యే ఏరియాలు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి, వరద నీరు నిల్వ ఉండకుండా ఏర్పాట్లు చేయాలి. అవసరమైన చోట డ్రైన్లు, కల్వర్టులు నిర్మించి వరద నీటిని మళ్లించాలి. ఎప్పటికప్పుడు డీసిల్టేషన్ చేయడంతో పాటు వరద తాకిడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నాలాలపై స్లాబులు తొలగించాలి. కానీ గ్రేటర్పాలకవర్గం ఆఫీసులో కూర్చొని రివ్యూ చేసేందుకే పరిమితమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలాల్లో నామమాత్రంగా డీసిల్టేషన్ చేసి చేతులు దులుపుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అకాల వర్షాల సమయంలోనూ కాలనీలు నీట మునుగుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు వానాకాలానికి ముందే చర్యలు చేపట్టాల్సిన ఆఫీసర్లు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు.
చిన్న వాన పడినా మునుగుడే...
వరంగల్ నగరంలో మొత్తం 37 లోతట్టు ప్రాంతాలు తరచూ ముంపునకు గురవుతున్నాయి. చిన్న వాన పడినా సాయిగణేశ్ కాలనీ, ఎస్‌ఆర్‌నగర్, లక్ష్మీగణపతి కాలనీ, మధురానగర్, సాయినగర్ కాలనీలు నీట మునుగుతున్నాయి. వరద బయటకు వెళ్లేందుకు సరైన వ్యవస్థ లేకపోవడంతో వారం రోజులు అవుతున్నా క్లియర్ కావడం లేదు. ఆ ప్రాంతం పక్కన జరుగుతున్న స్మార్ట్ రోడ్డు, డ్రైన్ పనులు పూర్తయితే ముంపు సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కానీ ఆ పనులు పూర్తి కావడం లేదు. అలాగే నగరంలోని అలంకార్ జంక్షన్, తిరుమల జంక్షన్, కాకాజీ కాలనీ, గోపాలపూర్ విజయనగర కాలనీ రోడ్డు, ఎస్‌బీహెచ్ కాలనీ, సీఎస్‌ఆర్ గార్డెన్, వరంగల్ చౌరస్తా, మండిబజార్, పోచమ్మ మైదాన్, ములుగు రోడ్డు, ఎంజీఎం జంక్షన్, బట్టల బజార్, సంతోషిమాతా టెంపుల్ లైన్ రోడ్లు నీట మునుగుతున్నాయి. ఆయా రోడ్ల వెంట ఉన్న డ్రైన్లపై శ్లాబులు వేయడంతో వరద నీళ్లు నిలిచి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సమస్యను పరిష్కరించాలని లీడర్లు, ఆఫీసర్ల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎన్నికల టైంలో ఓట్ల కోసం వచ్చే లీడర్లు వర్షాలు పడిన టైంలో మాత్రం కనిపించడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ముంపు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇండ్లు మునుగుతున్నా పట్టించుకుంటలే...
వర్షాలు పడిన ప్రతీసారి మా ఏరియాతో చుట్టు పక్కల ప్రాంతాలు మునిగిపోతున్నయ్. సమస్య పరిష్కరించాలని రెండేండ్ల నుంచి గ్రేటర్ ఆఫీసర్లు, లీడర్లకు విన్నవించుకుంటూ వస్తున్నం. అయినా కన్నెత్తి చూసిన వారే లేరు. ఓట్లప్పుడు కనిపించిన లీడర్లు ఇండ్లు మునిగినప్పుడు కనిపిస్తలేరు.
- బూస మహేశ్, సాయి గణేశ్ కాలనీ