Tragic incident: 244 రోజుల తర్వాత కోమా నుంచి కోలుకున్నా చావు తప్పలేదు..!

Tragic incident: 244 రోజుల తర్వాత కోమా నుంచి కోలుకున్నా చావు తప్పలేదు..!

అత్యంత అదృష్టవంతుడు.. దురదృష్టవంతుడు రెండూ ఇతనే.. ఇలా అనడానికి కారణం ఉంది. చావు ఎవరికీ చెప్పి రాదు. కానీ.. చావు అంచుల దాకా వెళ్లి బయటపడిన వ్యక్తిని కొన్నేళ్ల తర్వాత మృత్యువు మళ్లీ మింగేస్తే అంతకు మించిన విషాదం మరొకటి ఉండదు. ఫ్లోరిడాకు చెందిన ఈ యువకుడి విషయంలో అదే జరిగింది. ఫ్లోరిడాకు చెందిన డ్ర్యూ కాన్ అనే యువకుడికి 2017లో యాక్సిడెంట్ జరిగింది. తన 23వ పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని రోజుల తర్వాత బైక్ క్రాష్లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్రంగా గాయమై బ్రెయిన్ బాగా దెబ్బ తినడంతో కోమాలోకి వెళ్లాడు. రోజుల తరబడి చికిత్స అందించిన వైద్యులు చివరకు చేతులెత్తేశారు. బతికే అవకాశాలు దాదాపుగా లేవని, డ్ర్యూ కాన్ అవయవాలను దానం చేయాలని వైద్యులు ఆమె తల్లికి సూచించారు. అయినప్పటికీ అతని తల్లి కొడుకుపై ప్రేమను చంపులేకపోయింది. అతను బతుకుతాడన్న నమ్మకం సన్నగిల్లినా, వైద్యులు బతకడని తేల్చి చెప్పినా ఆశను వదులుకోలేదు. ఆమె నమ్మకమే కొడుకు ప్రాణాలను నిలబెట్టింది. దాదాపు 244 రోజులు కోమాలో ఉన్న డ్ర్యూ మృత్యువుతో పోరాడి జయించాడు. యాక్సిడెంట్ జరిగిన 244 రోజుల తర్వాత డ్ర్యూ కోమా నుంచి కోలుకుని స్పృహలోకి వచ్చాడు. ఈ అరుదైన క్షణాలను గుర్తుచేసుకుని తన తల్లి భావోద్వేగానికి లోనైంది. ‘‘యా మామ్.. ఐమ్ ఓకే.. ఐ లవ్ యూ మామ్’’ ("Yeah Mom, I'm OK," "I love you, mom."). కోమా నుంచి బయటికొచ్చాక తన తల్లితో డ్ర్యూ చెప్పిన మాటలివి. ఈ యువకుడికి ఇది మరో జన్మ లాంటిది.

డ్ర్యూ కోమా నుంచి అన్ని రోజుల తర్వాత బయటపడటం చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. "modern-day miracle man" అని డ్ర్యూను అందరూ పిలిచేవారు. కోమా నుంచి కోలుకున్న తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ అయిన ఈ యువకుడు సాధారణ జీవనం సాగించాడు. అమ్మ కళ్ల ముందు ఆనందంగా తిరుగుతూ కనిపించాడు. ఇలా అంతా బాగుందని ఇన్నేళ్ల నుంచి సంతోషంగా ఉన్న ఆ కుటుంబాన్ని మృత్యువు పికప్ ట్రక్ రూపంలో కోలుకోలేని దెబ్బ తీసింది. జులై 26న దురదృష్టవశాత్తూ డ్ర్యూ కాన్ను పికప్ ట్రక్ ఢీకొట్టింది. గత శుక్రవారం (జులై 26, 2024) తెల్లవారుజామున 5.30 గంటలకు జాక్సన్ విల్లీలోని కాలిన్స్ రోడ్లో వాకింగ్ చేస్తుండగా డ్ర్యూ కాన్ను పికప్ ట్రక్ ఢీకొట్టడంతో స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయాడు. తన కొడుకుతో ఏడేళ్లు అదనంగా కలిసి జీవించే అవకాశం దేవుడు ఇచ్చాడని నైరాశ్యం నిండిన హృదయంతో డ్ర్యూ కాన్ తల్లి చెప్పింది. బాధల నుంచి విముక్తి పొంది ఇకనైనా తన కొడుకు పర లోకంలో సుఖంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది.